NTV Telugu Site icon

PM Modi: డ్రైవర్‌ సీటు కోసం ఇండియా కూటమిలో కుమ్ములాటలు

Pmmodi

Pmmodi

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహా వికాస్‌ అఘాడీ కూటమిపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. డ్రైవర్‌ సీటు కోసం మహా వికాస్‌ అఘాడీ నేతలు కొట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో నిర్వహించిన ప్రచార సభలో మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గత అయిదేళ్లలో మహారాష్ట్రలో మారిన ‍ప్రభుత్వాలను ప్రాస్తావిస్తూ.. ఎంవీయే కూటమి రాష్ట్రంలో రెండున్నరేళ్లు పాలించిందని, ఆ కాలంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రజలను లూటీ చేసేందుకు వారు రాజకీయాల్లో ఉంటారని, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తారని మండిపడ్డారు. తర్వాత ఏర్పడిన మహాయుతి ప్రభుత్వంతో రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే రాష్ట్రంలో సుపరిపాలనను అందించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: DK Shivakumar: సిద్ధరామయ్య ‘‘మాస్ లీడర్’’.. అందుకే బీజేపీ ఖతం చేయాలని చూస్తోంది..

గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. గిరిజన వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ప్రజల్లో విష బీజాలు నాటి, మతం పేరుతో దేశ విభజనకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే వారంతా ఐక్యంగా ఉన్నంతకాలం బలంగా ఉంటారని.. ఏ శక్తీ వారిని అడ్డుకోలేదన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కాశ్మీర్‌పై వారి కుట్రను ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించడానికి శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించారని.. అది ఎప్పటికీ జరగని పని అని మోడీ స్ప ష్టం చేశారు.

మోడీ పర్యటన..
నవంబర్ 9న ప్రధాని మోడీ మధ్యాహ్నం అకోలాలో, మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రసంగించనున్నారు. నవంబర్ 12న చిమూర్, షోలాపూర్‌లలో ర్యాలీల్లో పాల్గొని సాయంత్రం పూణెలో జరిగే రోడ్‌షోలో మోడీ పాల్గొంటారు. నవంబర్ 14న ఛత్రపతి సంభాజీనగర్, రాయ్‌గఢ్, ముంబైలో చివరిగా ర్యాలీలకు ప్లాన్ చేశారు. 288 సీట్ల మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఫలితాలు మూడు రోజుల తర్వాత (నవంబర్ 23) లెక్కించబడతాయి.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేన వర్గం, అజిత్ పవార్‌కి చెందిన ఎన్‌సీపీతో కూడిన మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ నడుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన (UBT), శరద్ పవార్ NCP (SP), కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడి (MVA) కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో చూడాలి.

Show comments