Site icon NTV Telugu

PM Modi: ప్రధాని, సీఎంగా కాకుండా.. అలా ఉండటానికి గొప్ప గర్వంగా ఉంటుంది

Modi

Modi

తన జీవితంలో అతి పెద్ద గౌరవం మూడు సార్లు ప్రధానిగా ఉండడం.. 50 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కావడం కాదని.. బీజేపీ కార్యకర్తగా ఉండటమే తనకు గొప్ప గర్వమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై ప్రసంగించారు.

‘‘మోడీ దేశానికి ప్రధానమంత్రి అని… మూడోసారి ప్రధాని అయ్యారని.. 50 ఏళ్ల చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారని.. 25 ఏళ్ల నుంచి నిరంతరంగా పాలిస్తున్నారని ప్రజలు అనుకోవచ్చు గానీ.. అదంతా నిజమే కానీ నా జీవితంలో వీటన్నిటికంటే గొప్పది మరొకటి ఉంది. నేను బీజేపీ కార్యకర్తను. అదే నాకు గొప్ప గర్వం. పార్టీ విషయాల విషయానికి వస్తే నేను ఒక కార్యకర్తను. ఇప్పుడు నితిన్ నబిన్ నా బాస్.’’ అని మోడీ పేర్కొన్నారు.

ప్రజలకు సేవ చేయడం బీజేపీకి ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైనదని ప్రధాని అన్నారు. ‘‘మేము అధికారాన్ని ఆనంద సాధనంగా కాకుండా సేవ మాధ్యమంగా మార్చాం. అందువల్ల బీజేపీపై ప్రజల విశ్వాసం నిరంతరం బలపడింది. గత 11 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకుంటే.. బీజేపీ ప్రయాణం ప్రజల విశ్వాసాన్ని సంపాదించే అద్భుతమైన ప్రయాణం.’’ అని మోడీ పేర్కొన్నారు.

నితిన్ నబిన్..
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబిన్‌ (45) ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ సమక్షంలో నితిన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, జేడీ నడ్డా సహా ఎంపీలు, పార్టీ సీనియర్లు హాజరయ్యారు.

చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత నితిన్‌ నబిన్‌కే దక్కింది. నితిన్ నబిన్ 1980లో రాంచీలో జన్మించారు. తండ్రి కిశోర్ ప్రసాద్ సిన్హా మరణించాక 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా బంకిపూర్ అసెంబ్లీ నుంచి 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అనేక సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు నితిన్ నబిన్‌కు తొలి పరీక్ష కానుంది

Exit mobile version