PM Modi: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఒక వైపు వరుణ దేవుడు, మరో వైపు వరుణ్‌గాంధీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ లేటెస్టుగా ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే పైన ఐదు రోజులకే పెద్ద గండి పడింది. దీంతో దానికి ఏం సమాధానం చెప్పుకోవాలో కమలదళానికి అర్థంకానివిధంగా తయారైంది. డ్యామేజ్ అయిన ఈ రోడ్డు ఫొటోని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ నిన్న ట్విట్టర్‌లో పెట్టి నానా హడావుడి చేశారు. మోడీజీ మీరు ప్రారంభించిన రోడ్డు ఐదు రోజుల వానకే గట్టిగా నిలబడలేకపోయింది అంటూ ఆయన విమర్శించటం సంచలనంగా మారింది.
రహదారి నిర్మాణ పనుల్లో ఎంత నాణ్యత పాటిస్తున్నారో చూడండి అని వరుణ్ గాంధీ ఏకంగా ప్రధానమంత్రినే ఎద్దేవా చేయటం చర్చకు దారితీసింది. ఈ ఎక్స్‌ప్రెస్ వేని 15000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. 296 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ రహదారిపై జలౌన్ జిల్లా దగ్గరలోని ఛిరియా సాలెంపూర్ ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. దీంతో ఈ రోడ్డు పనులను నాసిరకంగా చేపట్టిన అధికారుల పైన, కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని వరుణ్‌గాంధీ కోరారు.
read more: Bhagyanagar Ganesh Utsav Samithi: తగ్గేదే లే… హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేసి తీరుతాం..
దీనిపై అధికారులు స్పందిస్తూ గుంతలను వెంటనే పూడ్చివేశామని, ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతించామని చెప్పారు. ఈ రోడ్డు విషయంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల నాణ్యత ఏంటో దీన్నిబట్టి తెలిసిపోతోందని, ఏ మేరకు అవినీతి జరిగిందో గమనించాలని అన్నారు. ఏడు జిల్లా గుండా వెళ్లే ఈ నాలుగు లేన్ల రహదారిని ప్రధాని మోడీ ఈ నెల 16న ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ నేతలు సైతం ఈ ఘటనను ప్రస్తావిస్తూ బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ నాయకులు రాష్ట్రంలోని తమ పాలనకు వంకలు పెట్టే పనేలేదంటూ గొప్పలు చెప్పుకుంటారని, ఈ రహదారి మొత్తం లోటుపాట్లమయంగా మారిందని విమర్శించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వేని ఫాస్ట్, స్మూత్ ట్రాఫిక్ కారిడార్ అని చెప్పుకోవటానికి కమలనాథులకు నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు.