PM Modi Meets Bangladesh PM Sheikh Haseena: నాలుగు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మన భారతదేశానికి వచ్చారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కి చేరుకోగా.. ప్రధాని మోదీ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఆమెకు త్రివిధ దళాల గౌరవ వందనం లభించింది. ఈ సందర్భంగా షేక్ హసీనా మాట్లాడుతూ.. భారత్ తమ మిత్ర దేశమని, భారతదేశానికి వచ్చినప్పుడల్లా తనకు చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందని, తమ విముక్తి యుద్ధంలో భారత్ చేసిన సహకారాన్ని ఎన్నటికీ మరువమని, ఒకరికొకరు తాము సహకరించుకుంటామని పేర్కొన్నారు. మోదీతో జరిపే చర్చలు సఫలమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన బంగ్లా ప్రధాని.. ఆర్థికంగా అభివృద్ధి చెందడం, పీపుల్స్ ఫెడరేషన్, పేదరిక నిర్మూలన తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్నేహంతో ఏ సమస్యనైనా పరిష్కరించగలరని, దానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పారు.
ఇక ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నామని షేక్ హసీనా తెలిపారు. ఈ సమస్యలపై ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నామని తాను భావిస్తున్నానని, తద్వారా భారత్ – బంగ్లాదేశ్‌లోని ప్రజలతో పాటు దక్షిణ ఆసియా జనాలు మెరుగైన జీవితాలను పొందగలుగుతారని చెప్పారు. ఇదే సమయంలో.. కొవిడ్ కాలంలోనూ, ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలోనూ భారత్ అందించిన సాయం గొప్పదని షేక్ హసీనా కొనియాడారు. కాగా.. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో షేక్ హసీనా, మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు మొదలయ్యాయి. కొన్ని అంశాలపై ఇరు దేశాధినేతలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్యం, నదీ జలాల భాగస్వామ్యం సహా పలు కీలక రంగాలలో భారత్‌తో బంగ్లాదేశ్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. చివరిసారిగా బంగ్లాదేశ్ ప్రధాని 2019లో భారత్‌ని సందర్శించారు.