Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెల నిర్వహించే రేడియో కార్యక్రమం ‘‘మన్ కీ బాత్’’ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణం స్పూర్తిదాయకం మోడీ అభివర్ణించారు. దేశంలోని సామాన్య ప్రజలు చేస్తున్న అసాధారణ సేవలను గుర్తించి, వారి కృషిని దేశ ప్రజలకు పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం గొప్ప అవకాశంగా నిలిచిందని అన్నారు. ఇన్నేళ్లుగా తనకు ఆప్యాయత, ఆదరణ చూపిన శ్రోతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 25న మన్ కీ బాత్ 139 వ ఎపిసోడ్‌లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం 2014, అక్టోబర్ 3న విజయదశమి సందర్బంగా ప్రారంభమైంది. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు చేరువైంది.
తాజా మన్ కీబాత్ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజల కృషిని దగ్గరగా తెలుసుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు. తనకు మన్ కీ బాత్ అనేది ప్రజలకు సేవ చేసుకునే తీర్థయాత్రతో సమానమని వివరించారు. సమాజం, దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులే నిజమైన తీర్థక్షేత్రాల వంటి వారని వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతోమంది అసాధారణమైన పనులు చేస్తున్నప్పటికీ, వారి సేవలు తరచుగా సమాజం దృష్టికి రావడం లేదని అన్నారు. అలాంటి వ్యక్తుల స్పూర్తిదాయక కథనాలను మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజల ముందుకు తీసుకురాగలుగుతున్నామని అన్నారు. దేశ ప్రజల కష్టపడి పనిచేసే తత్వం, ధైర్యం, నిబద్ధత, అంకితభావం, సేవాస్ఫూర్తిని గౌరవించడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తోందని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లుగా శ్రోతలు చూపిస్తున్న ప్రేమ, అప్యాతయ తనకు వెలకట్టలేని సంపద అని మోడీ అన్నారు.

