PM Modi Manipur Visit: జాతి ఘర్షణలతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్‌కు ప్రధాని నరేంద్రమోడీ రేపు వెళ్లనున్నారు. మే 2023లో రాష్ట్రంలో చెలరేగిన హింస తర్వాత తొలిసారి ప్రధాని పర్యటనకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధ్రువీకరించారు. ఈ పర్యటన గురించి చాలా రోజుల నుంచి ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ, తొలిసారిగా అధికారిక ప్రకటన వచ్చింది.
మణిపూర్ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మిజోరాం లోని ఐజ్వాల్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మణిపూర్‌లోని చురచంద్‌పూర్ చేరుకుంటారని వెల్లడించారు. మెయిటే, కుకీల ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో సంభాషిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా రూ. 7300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పునాది వేస్తారని, పీస్ గ్రౌండ్ జరిగే సభలో ప్రసంగిస్తారని చెప్పారు.
Read Also: Hyderabad : హయత్‌నగర్‌లో పక్కకు ఒరిగిన భవనం, కూలిపోతుందనే భయాందోళనలో ప్రజలు
ఈ జాతి ఘర్షణల్లో దెబ్బతిన్న జిల్లాల్లో చురచంద్ పూర్ ఒకటి. ఈ జిల్లాలోనే కనీసం 260 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. చురచంద్‌పూర్ నుంచి రాజధాని ఇంఫాల్ కు మోడీ 2.30 గంటలకు వెళ్తారు. అక్కడ రూ. 1200 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తారు. చురచంద్‌పూర్‌లో కుకీల ప్రాబల్యం ఉంటే, ఇంఫాల్‌లో మెయిటీల మెజారిటీ ఉంటుంది. దీంతో ప్రధాని రెండు వర్గాల వారిని కలిసినట్లు అవుతుంది.
