Site icon NTV Telugu

PM Modi at 75: 75వ బర్త్‌డే చేసుకుంటున్న మోడీ.. రాజకీయ ప్రస్థానమిదే!

Pmmodi

Pmmodi

నరేంద్ర మోడీ.. భారతదేశ ప్రధాని. దేశ ప్రధానిగా సక్సెస్‌గా దూసుకుపోతున్నారు. ముచ్చటగా మూడోసారి విజయవంతంగా పరిపాలనను కొనసాగిస్తున్నారు. 2014 నుంచి ఏకధాటిగా భారతదేశ ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. ఇటీవల ఇందిరాగాంధీ పేరున ఉన్న రికార్డ్‌ను కూడా బద్ధలు కొట్టారు. బుధవారం (సెప్టెంబర్ 17) గ్రాండ్‌గా 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. దేశ, విదేశాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులంతా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ కొనియాడారు.

మోడీ ప్రస్థానమిదే..
మోడీ.. సెప్టెంబర్ 17, 1950లో గుజరాత్‌లోని వాదు‌నగరులో జన్మించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వైపు ఆకర్షితులయ్యారు. అక్కడ ప్రచారక్‌గా శిక్షణ పొందారు. అనంతరం హిందూ జాతీయవాదం, సంస్థాగత క్రమశిక్షణ, అట్టడుగు వర్గాల ప్రజలతో సంబంధాలను పెంపొందించుకున్నారు.

రాజకీయాల్లోకి.
1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి మద్దతుగా జనసంఘ్ నిరసనలో పాల్గొన్నారు. దీంతో ఆయన రాజకీయ తొలి ప్రస్థానం మొదలైంది. అనంతరం కొద్ది కాలం నిర్బంధానికి గురయ్యారు. 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత పూర్తి కాలం ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా మారారు. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్, బీజేపీలో క్రమక్రమంగా ఎదుగుదల ప్రారంభమైంది. ఇక అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్ఎస్ఎస్ ప్రతిఘటన సందేశాన్ని చురుకుగా వ్యాప్తి చేశారు. ఇక 1978లో సూరత్, వడోదరలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను పర్యవేక్షించే ప్రాంతీయ నిర్వాహకుడిగా నియమితులయ్యారు. 1979లో అత్యవసర పరిస్థితి సమయంలో ఢిల్లీకి వెళ్లి ఆర్ఎస్ఎస్ పాత్రపై పరిశోధన చేశారు. అనంతరం 1985లో బీజేపీకి నియమితులయ్యారు.

ఇక బీజేపీలో నెమ్మది నెమ్మదిగా యువ కార్యకర్తగా ఎదుగుతున్నారు. గుజరాత్‌లో పార్టీ విస్తరణ కోసం విశేష కృషి చేశారు. ఇక 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో మోడీ మంచి గుర్తింపును పొందారు. దీని ఫలితంగా పార్టీకి నిర్ణయాత్మక విజయం లభించింది. అనంతర బీజేపీ గుజరాత్ యూనిట్‌కు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు.

ఇక 1990లో రామ జన్మభూమి ఉద్యమం సందర్భంగా లాల్ కృష్ణ అద్వానీతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. 1991-92లో ఏక్తా యాత్ర సందర్భంగా మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నాయకులతో బలమైన బంధం ఏర్పడింది. ఈ సందర్భంలోనే రాజకీయ వ్యూహకర్తగా మంచి ఖ్యాతిని సంపాదించారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవంల రెండు లోక్‌సభ స్థానాలే బీజేపీ గెలుచుకుంది. ఇది మోడీలో మరింత కసి పెంచింది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వెనుకుండి మోడీ రాజకీయాలు నడిపిస్తూ ఉండేవారు.

కీలక మలుపు..
2001లో గుజరాత్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ప్రభుత్వంపై అసంతృప్తి చోటుచేసుకుంది. దీంతో బీజేపీ అధి నాయకత్వం గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీని నియమించింది. ఇదే మోడీకి టర్నింగ్ పాయింట్ అయింది. తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ముందుండి నడిపించారు. అలా ఏకధాటిగా మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 12 ఏళ్లకు పైగా గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా పని చేసి ‘‘గుజరాత్ మోడల్’’గా పిలువబడే విధంగా రాష్ట్రాన్ని వృద్ధి చేశారు.

ప్రధానిగా..

ఇక 2013లో లోక్‌సభ ఎన్నికల సమయంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా గల నాయకుడిని వెతుకుతున్న సమయంలో మోడీని బీజేపీ నాయకత్వం ఎంచుకుంది. గుజరాత్ మోడల్ పేరుతో మోడీ దేశ మంతా పర్యటించారు. దీంతో అనూహ్యంగా 2014లో బీజేపీ భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లోనూ.. 2024లో జరిగిన ఎన్ని్కల్లోనూ మోడీ పార్టీని ముందుండి నడిపించి విజయపథంలోకి నడిపించారు. ప్రస్తుతం మూడోసారి దేశ ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. బుధవారం 75వ వసంతంలోకి అడుగుపెట్టారు.

ఇది కూడా చదవండి: Trump: యూకే టూర్‌లో ట్రంప్‌కు చేదు అనుభవం.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న ఫొటోలు ప్రదర్శన

Exit mobile version