PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ

  • భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి
  • ప్రజాస్వామ్యబద్ధంగానే చర్చిస్తాం!
  • 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి
  • 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
Modi

Modi

భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించారు. దేశంలో భిన్న భాషలు, విస్తృత మీడియా వ్యవస్థ, సోషల్ మీడియా వినియోగం ప్రజాస్వామ్య చర్చలకు బలాన్నిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, అభిప్రాయాల వ్యక్తీకరణకు డిజిటల్ వేదికలు కీలకంగా మారాయని వివరించారు. భారత్‌లో వందలాది భాషలు మాట్లాడుతున్నారని, దేశవ్యాప్తంగా సుమారు 80 వేల రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ఇతర ప్రచురణలు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియా విస్తరణతో ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి మరిన్ని అవకాశాలు లభించాయని చెప్పారు.

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వేదికల్లో భారత్‌లో 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు వివిధ అంశాలపై చర్చించడానికి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి డిజిటల్ వేదికలు సహాయపడుతున్నాయని వివరించారు. “మేం అంశాలపై ప్రజాస్వామ్యబద్ధంగా చర్చిస్తాం. డిజిటల్ శక్తి ప్రజలను అనుసంధానించడంతో పాటు వివిధ వేదికలపై చర్చలు జరపడానికి తోడ్పడింది” అని మోడీ అన్నారు.

చౌకగా మొబైల్ డేటా

దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం పెరగడం, మొబైల్ డేటా అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు కొత్త అవకాశాలు లభించాయని ప్రధాని చెప్పారు. 2014కు ముందు మొబైల్‌ ఫోన్‌ ఉన్నవారికే సమాచారం, జ్ఞానం, అవకాశాలు ఎక్కువగా అందుబాటులో ఉండేవని పేర్కొన్నారు. 2014 తర్వాత మొబైల్‌ డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ప్రస్తుతం చిన్న పట్టణాల్లోని విద్యార్థులు సైతం డిజిటల్‌ విద్యను అభ్యసించే అవకాశం పొందుతున్నారని చెప్పారు. కనెక్టివిటీ అనేది కేవలం ప్రజలను అనుసంధానించడమే కాదని వారికి అవకాశాలను కూడా చేరువ చేస్తోందని వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది ఫోరమ్‌ ప్రధాన అంశమైన ‘ఎమర్జింగ్ పవర్స్‌’ గురించి ప్రస్తావిస్తూ.. 21వ శతాబ్దంలో శక్తికి సంబంధించిన నిర్వచనం మారుతోందని అన్నారు. టెక్నాలజీ, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ప్రపంచంలో కీలకమైన శక్తులుగా ఎదుగుతున్నాయని వివరించారు. శక్తి ఎవరి చేతుల్లో ఉందనేది మాత్రమే కాకుండా.. దానిని ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. సాంకేతికత లక్షలాది మంది జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడాలా? లేక కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చాలా? అనే అంశాన్ని సమాజం ఆలోచించాలని అన్నారు.

శక్తి అంటే ఇతరులను నియంత్రించడం కాదని, వారికి సాధికారత కల్పించడమేనని మోడీ అభిప్రాయపడ్డారు. సాంకేతికతతో ప్రజలకు కొత్త అవకాశాలు కల్పించడం, వారి సామర్థ్యాలను పెంపొందించడం ముఖ్యమని చెప్పారు. ఇతరులను శక్తిమంతం చేసే ఆలోచన భారత్‌కు కొత్తది కాదని పేర్కొన్నారు.. నియంత్రణ నుంచి సాధికారత వైపు, పోటీ నుంచి సహకారం వైపు ప్రపంచం అడుగులు వేయాలని మోడీ పిలుపునిచ్చారు.