Site icon NTV Telugu

PM Modi: జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడులపై ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్..

Pm Modi

Pm Modi

PM Modi:జమ్మూ కాశ్మీర్లో వరస ఉగ్రవాదుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో గురువారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోడీ అధ్యక్షత జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అధికారులలో జమ్మూకాశ్మీర్ భద్రతా పరిస్థితులను గురించి సమీక్షించారు. తీవ్రవాద వ్యతిరేక చర్యల్ని ప్రధానికి వివరించారు. ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను మోహరించాలని ప్రధాని కోరారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడిన ప్రధాని, కేంద్రపాలిత ప్రాంతంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక యంత్రాంగం చేపడుతున్న చర్యలను మనోజ్ సిన్హా ప్రధానికి వివరించారు.

Read Also: Bandi Sanjay : హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్

గత ఆదివారం నుంచి జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఖత్రా నుంచి శివ్ ఖోరీ ఆలయానికి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బస్సు లోయలో పడి 10 మంది మరనించారు. మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని సైదా గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు ఇళ్లపై కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టి ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఒక జవాన్ వీర మరణం పొందారు.

మంగళవారం అర్థరాత్రి దోడా జిల్లాలోని చెక్ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా అధికారులకు గాయలయ్యాయి. ఈ నేపథ్యంలో సమీప ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. దట్టమైన అడవులు, కొండలతో కూడిన ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇదిలా ఉంటే బుధవారం దోడా జిల్లాలో మరోసారి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కైంటర్ జరిగింది. వరసగా మూడు రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు జరగడంతో జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. మరోవైపు భద్రతా బలగాలపై దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది.

Exit mobile version