NTV Telugu Site icon

Amit Shah: 4 దశల్లోనే బీజేపీ 270 సీట్లు దాటింది.. కాంగ్రెస్‌కి 40 కూడా రావు..

Amit Shah

Amit Shah

Amit Shah: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తొలి నాలుగు దశల్లోనే ప్రధాని మోడీ 270 సీట్లను అధిగమించారని, కాంగ్రెస్ రాహుల్ గాంధీకి 40 సీట్లు కూడా రావని అన్నారు. పశ్చిమ చంపారన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ బాబాకు 40 సీట్లు కూడా రావని, లాలూ ప్రసాద్ యాదవ్‌కి 4 సీట్లు కూడా రావడం లేదని ఆయన అన్నారు.

గత 10 ఏళ్లలో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కన్నా బీహార్‌కి తాము ఎక్కు నిధులు ఇచ్చామని చెప్పారు. సోనియా-మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు లాలూ జీ మంత్రిగా ఉన్నారని, ఆయన బీహార్‌కి ఎంత డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,80,000 కోట్లు ఇస్తే, మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏకంగా రూ. 14,80,000 కోట్లు ఇచ్చిందని అమిత్ షా అన్నారు.

Read Also: Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్.. ప్రాణాలతో ఉండాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు..

అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్‌ని మనం గౌరవించాలని మాట్లాడిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని అవమానించిన వారే ఇప్పుడు దానితో తిరుగుతున్నారని కాంగ్రెస్‌ని విమర్శించారు.

బీహార్‌లోని 40 స్థానాలకు గానూ 2019లో బీజేపీ-జేడీయూ కూటమి ఏకంగా 39 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి ఈ కూటమి క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటోంది. ఈసారి కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడి బీహార్‌లో పోటీ చేస్తున్నాయి. ఆర్జేడీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక బీజేపీ-జేడీయూ కూటమిలో బీజేపీ 17, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఐదు స్థానాల్లో, జితన్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి.