వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల్లో మాదిరిగానే.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను కూడా కమలనాథులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. నాలుగోసారి అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంటే.. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఢిల్లీ టూర్‌లో రేవంత్‌రెడ్డి.. ప్రధాని, కేంద్రమంత్రులతో వరుస భేటీలు
ఇందులో భాగంగానే బుధవారం బెంగాల్ ఎంపీలు, రాష్ట్ర నాయకులతో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘సర్’పై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని పట్టించుకోవద్దని సూచించారు. ఓటర్ సర్వే అనేది ఎన్నికల సంఘం చేపట్టే ఒక సరళమైన కార్యక్రమాన్ని పేర్కొన్నారు. దీనిపై ఎవరూ కూడా కంగారు పడొద్దని తెలిపారు. ‘‘SIR అంటే అర్హత ఉన్న ఓటర్లను చేర్చడం.. అర్హత లేని వారిని తొలగించడం మాత్రమే.’’ అని ప్రధాని అన్నారు.
ఇది కూడా చదవండి: Imran Khan: ఆసిమ్ మునీర్ భారత్‌తో యుద్ధానికి ఆరాటపడుతున్నాడు.. ఇమ్రాన్ ఖాన్ సోదరి సంచలన వ్యాఖ్యలు
అందరూ సమిష్టిగా.. నమ్మకంతో కృషి చేస్తే 2026లో బెంగాల్‌లో అధికారం చేపట్టడం ఖాయమని అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల కథనాలతో పరధ్యానం చెందవద్దని ఎంపీలను హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో 2011లో ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి 2016లో బలమైన ఉనికిని సాధించామని.. బీజేపీ ఎంత వేగంగా పుంజుకుందో గుర్తించుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు షమిక్ భట్టాచార్య, కేంద్ర మంత్రులు శాంతను ఠాకూర్, సుకాంత మజుందార్ పాల్గొన్నారు. ఎన్నికల సన్నద్ధత, రాష్ట్రవ్యాప్తంగా మద్దతును సమీకరించడానికి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ప్రధాని సూచించారు. ఇప్పటికే బెంగాల్ బాధ్యతలు భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లాబ్ దేబ్‌లకు అప్పగించింది.
