NTV Telugu Site icon

PM Modi: స్టార్టప్స్ లో మూడో స్థానం.. మొబైల్ తయారీలో రెండో స్థానం

Pm Modi

Pm Modi

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని.. 47 ఏళ్ల క్రితం భారతీయుల డీఎన్ఏలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నించారని.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో నల్లని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృతి, ఆహారం, దుస్తులు, సంగీతం మరియు సంప్రదాయాల వైవిధ్యం మన ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆయన అన్నారు.

జీ-7 దేశాల సమావేశం కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని అక్కడ మ్యూనిచ్ నగరంలో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. సుస్థిర వాతావరణ పద్ధతులు భారతదేశ ప్రజల జీవితాల్లో భాగంగా మారాయని.. దేశంలో 10 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని.. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమ కర్తవ్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని మోదీ అన్నారు. నేడు దేశంలోని ప్రతీ గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా ఉందని.. విద్యుత్, 99 శాతం గ్రామాలకు వంట గ్యాస్ కూడా ఉందని మోదీ వెల్లడించారు. ఇండియా గత రెండేళ్ల నుంచి 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోందని ఆయన వెల్లడించారు.

గత శతాబ్ధంలో జర్మనీ, ఇతర దేశాలు పారిశ్రామిక విప్లవం నుంచి ప్రయోజనం పొందాయని.. భారత్ ఆ సమయంలో బానిసగా ఉందని, కానీ ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఇండియా వెనకబడి ఉండదని.. ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఇండియాలో స్టార్టప్స్ ఉండేవి కావని.. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ ఉందని.. నేను మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ రెండోస్థానంలో ఉందని మోదీ వెల్లడించారు.

బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ లో ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. లక్ష్యం కన్నా ఐదు నెలల ముందే దీన్ని సాధించామని.. కోవిడ్ -19 సమయంలో భారత్ తమ ప్రజలకు టీకాలు వేయడానికి 10-15 ఏళ్లు పడుతుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయని.. నేడు 90 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ తీసుకున్నారని.. 95 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నవారు ఉన్నారని మోదీ వెల్లడించారు.