PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు

  • 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది
  • గంగోత్రి నుంచి గంగాసాగర్‌ వరకు కమలం వికసించింది
  • విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
Modi

Modi

పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది అని ప్రధాని మోడీ అన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం సందర్భంగా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఈ ఘన విజయంతో బీజేపీ కార్యకర్తలు చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఈరోజు చారిత్రాత్మకమైనది.. అపూర్వమైనది.. కార్యకర్తల ఆనందంలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం, పనితీరు రాజకీయాలపై విశ్వాసం చూపించే రోజు అన్నారు. బెంగాల్‌లో బీజేపీ ఘన విజయంతో గంగోత్రి నుంచి గంగాసాగర్‌ వరకు కమలం వికసించిందని మోడీ పేర్కొన్నారు.

నేటి నుంచి బెంగాల్‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. నేడు 20కి పైగా రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ‘‘నాగరిక్ దేవో-భవ’’ మా మంత్రం. ప్రజలు మమ్మల్ని మరింత ఎక్కువగా విశ్వసిస్తున్నారు.’’ అని అన్నారు.

‘‘బెంగాల్‌లో తొలిసారి భయం కాదు.. ప్రజాస్వామ్యం గెలిచింది. దేశ ప్రజల మనోభావాలను, సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్, టీఎంసీ, ఇతరులు కొన్ని రోజుల క్రితం ‘నారీ శక్తి’ని అడ్డుకున్నారు. అందుకే మహిళలు వారిని శిక్షించారు. ఎన్నికల సమయంలో విదేశాల్లో యుద్ధ సంకేతాలు ఉన్నప్పటికీ భారతదేశంలోని ప్రజలు అటువంటి సమయంలో స్థిరత్వానికే ఓటు వేశారు. బెంగాల్ తొలి కేబినెట్ సమావేశంలో ఆయుష్మాన్ భారత్‌కు పచ్చజెండా ఊపుతాం.’’ అని ప్రకటించారు.

‘‘ఇక బెంగాల్‌లో మహిళలకు భద్రత, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. బెంగాల్‌లో భయం, హింస లేని ఈ కొత్త ఉదయం కోసం తరతరాలుగా ఎదురుచూశారు.’’ అని అన్నారు. ‘‘భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్’’ అంటూ ఉత్తేజపరిచే నినాదాలతో మోడీ ప్రసంగాన్ని ముగించారు.