NTV Telugu Site icon

Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..

Sidhu

Sidhu

Congress: భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మరణించారు. అయితే, ఆయన మరణంపై రాజకీయ దుమారం చెలరేగింది. మన్మోహన్ సింగ్ స్మారకం కోసం స్థలం కేటాయింపుపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. అధికార బీజేపీ రాజకీయాలు ఆడుతోందని ఆరోపించారు. ఒక వేళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి రాజ్‌ఘాట్‌లో స్మారక చిహ్నం లేకపోతే ఆ పార్టీకి ఎలా అనిపించేదని ప్రశ్నించారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదని, యావత్ దేశ చరిత్రకు సంబంధించిందని ఆయన అన్నారు.

‘‘ఒక వ్యక్తి చనిపోయాక, అతనిపై ఉన్న శత్రుత్వాలు అన్ని నశిస్తాయి. కానీ ఇక్కడ రాజకీయం జరుగుతోంది. అటల్ జీ అంత్యక్రియలు తర్వాత స్మారక చిహ్నం రాజ్‌ఘాట్ వద్ద నిర్మించబడదని, వేరే చోట నిర్మిస్తామని చెబితే మీకు ఎలా అనిపిస్తుంది.? ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశ చరిత్రకు సంబంధించింది’’ అని సిద్ధూ విలేకరుల సమావేశంలో అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కేటాయింపు అంశంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీని నిందించారు. రాజ్‌ఘాట్ కాకుండా నిగంబోధ్ ఘాట్‌లో ఏ మాజీ ప్రధాని అంత్యక్రియాలు నిర్వహించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

Read Also: AP DGP: మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు..

కాంగ్రెస్ నేత పర్తాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. దేశం మొత్తం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే స్థలంలోనే ఆయన స్మారకం నిర్మించాలని కోరుకుందని, ఇది కేవలం కాంగ్రెస్ డిమాండ్ మాత్రమే కాదని, పంజాబ్, సిక్కులు, ఈ దేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల డిమాండ్ అని అన్నారు. దీని గురించి ముందుగానే ప్రధాని మోడీ ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ విమర్శలకు ధీటుగా బీజేపీ స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. డాక్టర్ మన్మోహన్ సింగ్‌ మరణంలో కూడా కాంగ్రెస్ రాజకీయాలు వెతుకుతోందని అన్నారు. మాజీ ప్రధానిని ఎప్పుడూ కాంగ్రెస్ గౌరవించలేదని ఆరోపించారు. గాంధీ కుటుంబం కానీ ఏ నాయకుడిని గౌరవించకపోవడం కాంగ్రెస్ చరిత్ర అని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మదన్ మోహన్ మలవియా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు భారతరత్న ఇచ్చి మోడీ ప్రభుత్వం గౌరవించిందని అన్నారు.