Site icon NTV Telugu

Gujarat: జామ్‌నగర్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి

Gujarat

Gujarat

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శిక్షణలో ఉన్న ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ చనిపోగా.. మరొక పైలట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జామ్‌నగర్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న సువార్ద గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే స్థానిక ప్రజలకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. అందరూ క్షేమంగానే ఉన్నారు. ఇక ప్రమాదం జరిగినప్పుడు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు వైమానిక దళం తెలిపింది. రెండు సీట్లు కలిగిన విమానం రాత్రిపూట కూలిపోయినట్లుగా పేర్కొన్నారు. పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించి ఎజెక్షన్ ప్రారంభించారు. గ్రామస్తులకు ఎలాంటి హానీ సంభవించకుండా తప్పించినట్లు ఐఏఎఫ్ ప్రకటనలో పేర్కొంది. పైలట్ మృతికి సంతాపం తెలిపింది. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

జామ్‌నగర్ కలెక్టర్ కేతన్ ఠక్కర్ మాట్లాడుతూ… జామ్‌నగర్ జిల్లాలో వైమానిక దళానికి చెందిన ఒక విమానం కూలిపోయిందని తెలిపారు. ఒక పైలట్‌ చనిపోగా.. మరొక పైలట్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పినట్లు తెలిపారు. స్థానికులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అగ్నిమాపక సిబ్బంది.. పోలీసులు సకాలంలో చేరుకుని పరిస్థితుల్ని చక్కదిద్దునట్లు వెల్లడించారు.

 

Exit mobile version