దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Also: ఔను .. భారత్ పెగాసిస్ కొనుగోలు చేసింది!
2017లో ఇజ్రాయెల్‌తో పెగాసస్‌పై డీల్ జరిగిందంటూ న్యూయార్క్ టైమ్స్ తాజా ప్రచురించిన కథనం దేశ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకునే అవకాశాలున్నాయి. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగాసస్ స్పైవేర్ భాగమేనని న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే.
