NTV Telugu Site icon

Congress: “ప్రార్థనా స్థలాల” చట్టానికి కాంగ్రెస్ మద్దతు.. సుప్రీంకోర్టులో పిటిషన్..

Places Of Worship Act

Places Of Worship Act

Congress: ప్రార్థనా స్థలాలా చట్టం-1991ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గత నెలలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించిందవి. అయితే, ప్రార్థనా స్థలాల కేసులో కాంగ్రెస్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గురువారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆ పార్టీ కోరింది. ప్రార్థనా స్థలాల చట్టంపై ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం పిటిషన్ దాఖలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలతో చేరింది. ఈ నెల ప్రారంభంలో ఓవైసీ పిటిషన్‌ని విచారించడానికి కోర్టు అంగీకరించింది. ఫిబ్రవరి 17న ఈ పిటిషన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్‌తో పాటు డీఎంకే సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ చట్టానికి మద్దతు ఇస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం.. దేశం స్వాతంత్య్రం పొందిన ఆగస్టు 15, 1947నాటికి వివిధ ప్రార్థనా స్థలాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో, వాటి స్థితిని మార్చడాన్ని నిరోధిస్తుంది. అంటే, ఒక ప్రార్థనా మందిరాన్ని తిరిగి పొందడం లేదా దాని స్థితిని మార్చడం కుదరదు. భారతీయ సమాజం లౌకిక స్వభావాన్ని కాపాడటానికి ఈ చట్టం అవసరమని కాంగ్రెస్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ చట్టం రద్దు అయితే, మత సామరస్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. ఈ చట్టం ‘‘భారత ప్రజల ఆదేశం’’ కాబట్టి దీనిని ఆమోదించారని చెప్పింది.

Read Also: NEET-UG 2025: పెన్-పేపర్ పద్ధతిలో నీట్.. ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో పరీక్ష..

మందిర్-మసీదు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న ప్రార్థనా స్థలాల స్థితిని మార్చవద్దని కాంగ్రెస్ బలంగా కోరుకుంటోంది. ప్రస్తుతం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు, మధురలోని షాహి ఇద్గా మసీదు, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని షాహీ జామా మసీదులు వివాదంలో ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పటి ఆలయాలని, మొఘలుల కాలంలో ఆలయాలుగా ఉన్న వీటిని కూల్చి మసీదులుగా మార్చారని హిందూ పక్షాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ మూడు కేసులు కూడా కోర్టుల్లో ఉన్నాయి.

ప్రస్తుతం మందిర్-మసీదు కేసుల్ని నిలిపేయాలని సుప్రీంకోర్టు కింది కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. వారణాసి, మధుర, సంభాల్‌తో సహా దేశవ్యాప్తంగా 10 మసీదుల మతపరమైన స్థితిని నిర్ధారించడానికి సర్వే చేయాలని కోరుతూ హిందూ సంఘాలు 18 వ్యాజ్యాలను దాఖలు చేశాయి. ప్రస్తుతం వీటిన్నింటిని సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం నిలిపేసింది. ప్రార్థన స్థలాల చట్టంలోని మూడు సెక్షన్లను పక్కన పెట్టాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు పలు పిటిషన్లను ప్రత్యేక ధర్మాసనం విచారిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఈ కేసుకు సంబంధించిన వివిధ కోణాలను పరిష్కరించడానికి సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు.