Site icon NTV Telugu

Jagdish Devda : ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..

Jagdish Devda

Jagdish Devda

Deputy CM: ఇటీవల మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేత విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదంతాన్ని మరిచిపోకముందే, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీస్ దేవ్డా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సివిల్ డిఫెన్స్‌లో శిక్షణ కోసం వచ్చిన వాలంటీర్లను ఉద్దేశిస్తూ ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రజలతో పాటు సైన్యం దేశ ప్రధాని నరేంద్రమోడీ పాదాలకు నమస్కరించాలి అని అన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ప్రసంగంలో ఈ వ్యాక్యలు చేశారు. ‘‘పహల్గామ్‌లో పర్యాటకుల్ని వారి మతం ఆధారంగా వేరు చేయడం, మహిళల్ని పక్కన ఉంచి, పురుషుల్ని కాల్చి చంపడం మనం చూశాము. అప్పటి నుంచి ఈ దేశ ప్రజలు ఉగ్రవాదులపై, వారికి మద్దతు ఇచ్చే వారిపై ప్రతీకారం తీర్చుకునే వరకు విశ్రమించరు. ఈ రోజు దేశం మొత్తం, సైన్యం ప్రధాని మోడీ తీసుకున్న బలమైన చర్యకు ఆయన పాదాలకు నమస్కరిస్తుంది. ఆయనకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి’’ అని దేవ్డా అన్నారు.

Read Also: Ponguleti Srinivasa Reddy: భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం.

దీనికి కొన్ని రోజుల ముందు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా భారత ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆయనను తీవ్రంగా మందలించింది, ఆమెకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అయితే, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సాయుధ బలగాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది.

‘‘మన సైనికులు దేషశాన్ని రక్షిస్తారు. రాజకీయ నాయకుల అహంకారాన్ని కాదు. భారత సైన్యం ప్రధాని మోడీ పాదాలకు నమస్కరిస్తారని చెప్పడం దారుణం మాత్రమే కాదు, ఇది మన సాయుధ దళాల త్యాగం, శౌర్యం, గౌరవానికి అవమానం. బీజేపీ నేత జగదీస్ దేవ్డా మాటలు అవమానకరమైనవి’’ అని యూత్ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ సుప్రియా శ్రీనేట్ ప్రధాని మోడీ ఆ బీజేపీ నేతను తొలగించాలని కోరారు.

Exit mobile version