Site icon NTV Telugu

Border violence: నివురుగప్పిన నిప్పులా అస్సాం-మేఘాలయ సరిహద్దు.. శాంతి చర్చలకు ప్రయత్నం

Border Violence

Border Violence

Peace talks between Assam-Meghalaya: అస్సాం- మేఘాలయ సరిహద్దుల్లో భారీగా హింస జరగడంతో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. కలప స్మగ్లింగ్ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు హింసకు దారి తీసింది. ప్రస్తుతం పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు సమీపంలో ఉన్న మేఘాలయ, అస్సాం సరిహద్దు గ్రామం అయిన ఉమ్లాపర్ వద్ద అస్సాం పోలీసులు నిఘాపెంచారు. ఇదిలా ఉంటే అస్సాం పెట్రోలియం కార్మికులు మేఘాలయకు ఇంధన రవాణా నిలిపివేస్తునట్లు ప్రకటించారు. అస్సాం పెట్రోలియం మజ్దూర్ యూనియన్ అన్ని చమురు కంపెనీలకు లేఖలు రాసింది. ట్యాంకర్లలో ఇంధనం లోడ్ చేయకూడదని కోరింది.

Read Also: BJP vs BJP: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం.. బీజేపీ వర్సెస్ బీజేపీగా మారిన అంశం

అస్సాం నెంబర్ ప్లేట్ తో మేఘాలయకు వెళ్తున్న వాహనాలపై దాడులు జరుగుతున్నట్లు చెబుతూ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ చెలరేగిన క్రమంలో మా డ్రైవర్లు దాడులకు గురయ్యారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అస్సాం నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు మేఘాలయ కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని అస్సాం పోలీసులు సూచించారు. మంగళవారం అస్సాం-మేఘాలయ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో అక్రమంగా నరికివేసిన కలపతో వెళ్తున్న ట్రక్కును అస్సాం అటవీ సిబ్బంది అడ్డుకోవడంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు చనిపోయారు.

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మాతో గంటపాటు చర్చించారు. పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని ముక్రోహ్ ప్రాంతంలో జరిగిన కాల్పులపై సీబీఐ విచారిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడేందుకు మేఘాలయ ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ పై సస్పెన్షన్ విధించింది. ఏడు జిల్లాల్లో 48 గంటల పాటు సస్పెన్షన్ కొనసాగనుంది. ఈ ఘర్షణలు సద్దుమణిగేలా కేంద్ర చొరవ చూపాలని ఇరు రాష్ట్రాలు కోరుతున్నాయి.

Exit mobile version