NTV Telugu Site icon

PM Modi: గిరిజన వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉంది

Pmmodi

Pmmodi

గిరిజన వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. బీహార్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆదివాసీ మహిళకు తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని తెలిపారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ ప్రభుత్వం అదృష్టంగా భావిస్తోందని చెప్పారు. ముర్ము పేరు ప్రకటించగానే ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ దేశం మొత్తానికి పిలుపునిచ్చారని ప్రధాని గుర్తుచేశారు. ఆదివాసీల కష్టాలను తీర్చేందుకు పీఎం జన్‌మన్‌ యోజన పథకం ద్వారా రూ.24వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన కళ మరియు సంస్కృతికి అంకితమైన అనేక మందిని పద్మ అవార్డులతో సత్కరించినట్లు చెప్పారు. రాంచీలోని బిర్సా ముండా, శ్రీనగర్, సిక్కింలో రెండు గిరిజన పరిశోధనా కేంద్రాలను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. లేహ్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోవా రిగ్పా, అరుణాచల్‌లో నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రీసెర్చ్‌లను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Off The Record: కేటీఆర్ ఢిల్లీ టూర్‌లో అసలు జరిగిందేంటి..?

గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని.. వారి అభివృద్ధి కోసం కృషి చేయలేదని ప్రధాని విమర్శించారు. సమాజానికి దూరంగా నివసిస్తున్న ఆదివాసీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వారు పండించే దాదాపు 90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చామన్నారు. ఆదివాసీ యువత క్రీడలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని.. వారిని మరింత ప్రోత్సహించడానికి అనేక క్రీడా సౌకర్యాలను ప్రారంభిస్తున్నామని మోడీ తెలిపారు.