Passport Row: పాస్‌పోర్టు ఉంటే, భారత పౌరసత్వం ఉన్నట్లు కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. భారత పాస్‌పోర్ట్ ప్రధానంగా ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, దానిని పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన రుజువుగా పరిగణించరాదని చెప్పింది. అయితే, ఈ ప్రకటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల ప్రక్షాళన, పౌరసత్వంపై చర్చలు జరుగుతున్న వేళ కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా చేసింది. పాస్‌పోర్టు జారీలో ధృవీకరణ, పలు ప్రభుత్వ పత్రాల పరిశీలన ఉంటాయని, అయితే పౌరసత్వం మాత్రం రాజ్యాంగం, 1955 పౌరసత్వ చట్టం ద్వారా నిర్ధారించబడుతుందని విదేశాంగ శాఖ చెప్పింది.
ఈ ప్రకటనపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పాస్‌పోర్టు 1967 నాటి పాస్‌పోర్ట్ చట్టంపై ఆధారపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో పౌరులు కాని వారికి కూడా పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలను జారీ చేయవచ్చు. దీని వల్లే పాస్‌పోర్టు కలిగి ఉండటం పౌరసత్వానికి రుజపువగా పరిగణించలేము. 2013 నాటి ఒక తీర్పులో, పాస్‌పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి అంతిమ రుజువు కాదని బొంబాయి హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. పౌరసత్వాన్ని పౌరసత్వ చట్టం మరియు ఇతర ఆధారాల ఆధారంగా నిర్ధారించాలని కోర్టు పేర్కొంది.
బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. కేంద్రం ఎలాంటి కొత్త విధానాన్ని ప్రకటించలేదని, కేవలం సుదీర్ఘ కాలంగా ఉన్న చట్టపరమైన వైఖరినే పునరుద్ఘాటించిందని అన్నారు. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల పత్రాలు, ఓటర్ జాబితా, పాఠశాల ధ్రువీకరణ పత్రాలు, భూమి రికార్డులు, ప్రభుత్వ పత్రాలు, పాస్‌పోర్టులు అన్నీ కలిసి పౌరసత్వాన్ని నిరూపిస్తాయని యఆయన అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నాయని ఆరోపించారు.

