Site icon NTV Telugu

Pakistan: ‘‘అయోధ్యలో బాబ్రీ మసీదు, అజాన్ పఠించేది పాక్ ఆర్మీ చీఫ్, సిక్కులు యుద్ధం చేయొద్దు’’..

Pak

Pak

Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని పలువురు పాకిస్తాన్ నేతలు చెబుతున్నారు. భారత్ దాడి చేస్తే తాము తీవ్రంగా స్పందిస్తామని చెబుతూనే, పాకిస్తాన్ యుద్ధాన్ని నిలురించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. మంగళవారం, ప్రధాని మోడీ అధ్యక్షత జరిగిన అత్యున్నత సమావేశంలో, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే, పాక్ రాజకీయ నాయకులు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానడం లేదు. తాజాగా, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పార్లమెంటేరియన్లు (PPPP) నాయకురాలు పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పాకిస్తాన్ సెనెట్‌లో ఆమె ప్రసంగిస్తూ.. ‘‘ కొత్తగా నిర్మించే బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను పాకిస్తాన్ సైనికుడు వేస్తాడు’’ అని వ్యాఖయానించింది. ఇంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మొదటి అజాన్ పఠిస్తారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. మేము గాజులు ధరించి లేమని ఆమె అన్నారు.

Read Also: Visakha Rain: విశాఖలో మళ్లీ వర్షం.. సింహాచలంలో భక్తుల దర్శనానికి ఇక్కట్లు

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారత వ్యతిరేక వైఖరిని ఆమె ప్రశంసించారు. పంజాబ్ ప్రజలు ముఖ్యంగా సిక్కులు పాకిస్తాన్‌తో యుద్ధానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ‘‘గురునాంక్ దేవ్’’ భూమిగా అభివర్ణిస్తూ, ఇది సిక్కుల పవిత్ర స్థలమని, అందువల్ల సిక్కులు యుద్ధం చేయవద్దని కోరారు.

పాకిస్తాన్ భారతదేశాన్ని 1000 ఏళ్లు పాలించిందనే విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలని ఏఎన్పీ పార్టీ సెనెటర్ హాజీ హిదయతుల్లా ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ పాలకుల వంటి వివిధ ముస్లిం రాజవంశాలు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను దాదాపు 13 నుండి 19వ శతాబ్దం వరకు పాలించాయి. అయితే, వీరు పాకిస్థానీలు కాదు, పాకిస్తాన్ ఒక దేశంగా 1947లో ఏర్పడింది. ముస్లిం పాలకులు టర్కీ, ఆఫ్ఘన్, మొఘల్ మూలానికి చెందినవారు. హాజీ హిదయతుల్లా చరిత్ర తెలియకుండా ఈ వ్యాఖ్యలు చేశాడు.

Exit mobile version