Site icon NTV Telugu

Kanwar Yatra: యూపీ ‘కన్వర్ యాత్ర’ రూల్స్‌ని అమెరికా ముందు లేవనెత్తిన పాకిస్తాన్..

Us

Us

Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’ ఆర్డర్ ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యాయి. యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు, ఇతర దుకాణదారులు తమ పేర్లు బోర్డులపై ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిని వర్ణవివక్ష, హిట్లర్ నాజీ రూల్స్‌గా ఆరోపించాయి. అయితే, ఈ ఆర్డర్స్‌ని పాస్ చేసిన ముజఫర్ నగర్ పోలీసులు మాత్రం ఈ నిబంధనను సమర్థించారు. భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు రాకుండా, శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆదేశాలపై మధ్యంతర స్టే విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ఈ అంశాన్ని పాకిస్తాన్, అమెరికా వద్ద లేవనెత్తింది. పాకిస్తాన్ జర్నలిస్ట్ యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ మాథ్యూ మిల్లర్ వద్ద కన్వర్ యాత్ర గురించి ప్రశ్నించారు. అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యతపై భారత్‌‌ని సంప్రదించామని అన్నారు. ‘‘ మేము ఆ నివేదికలను చూశాము. ఆ నిబంధనల అమలుపై భారత సుప్రీంకోర్టు జూలై 22 న మధ్యంతర స్టే జారీ చేసిన నివేదికలను కూడా మేము చూశాము. కాబట్టి ఈ రూల్స్ వాస్తవానికి అమలులో లేవు’’ అని మిల్లర్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా అందరికి మతస్వేచ్ఛ హక్కుని ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.

Read Also: Lalu Prasad: బీహార్ ప్రజలను నితీష్ కుమార్ మోసం చేశారు…

పలు సందర్భాల్లో అమెరికా రిపోర్టుల్లో భారత్‌లో మతస్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని చెబుతోంది. ఈ అంశం ఇరు దేశాల మధ్య వివాదాస్పదమవుతోంది. అనేక సందర్భాల్లో వీటిని పక్షపాత రిపోర్టులుగా భారత్ వ్యతిరేకించింది. మరోవైపు భారత అంతర్గత విషయమైన కన్వర్ యాత్రను పాకిస్తాన్ ప్రస్తావించింది. తమ దేశంలో హిందువులు, సిక్కులు, క్రైస్తవుల వంటి మైనారిటీలపై దాడుల్ని పట్టించుకోని పాక్, భారత్‌లో మాత్రం మైనారిటీలపై హింస జరగుతోందని అబద్ధపు ఆరోపణలు చేస్తోంది.

కన్వర్ యాత్రకు సంబంధించి దుకాణదారులు వారి పేర్లను ప్రదర్శించాలనే రూల్స్‌పై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చర్యపై ప్రతిపక్షాలతో పాటు కేంద్రంలోని బీజేపీ మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. హిందూ, ముస్లిం షాపుల యజమానుల మధ్య ఆర్థిక అసమానతలను సృష్టించేందుకే ఈ ఉత్తర్వు ఉందని ప్రతిపక్షం పేర్కొంది.

Exit mobile version