NTV Telugu Site icon

Pakistan: “అక్కడికి వెళ్లి ఉగ్రవాదుల్ని హతమారుస్తాం”.. రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన పాకిస్తాన్..

Pakistan India

Pakistan India

Pakistan: ఉగ్రవాదులపై రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉగ్రవాదుల్ని వదలేది లేదని, ఉగ్రవాదులు పాకిస్తాన్ తిరిగి పారిపోతే, అక్కడికి వెల్లి వారిని చంపేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. ఈ వ్యాఖ్యలు ‘బాధ్యతారాహిత్యం’ అని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని శనివారం పాకిస్తాన్ ఖండించింది.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో ‘‘ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి’’ అని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు దీర్ఘకాలిక నిర్మాణాత్మక అవకాశాలను అడ్డుకుంటాయి అని పేర్కొంది. పాకిస్తాన్ ఎల్లప్పుడు ఈ ప్రాంతంలో శాంతికి తన నిబద్ధతను ప్రదర్శిస్తోందని, పాకిస్తాన్ దృఢ సంకల్పం, తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని చరిత్ర ధృవీకరిస్తుందని పేర్కొంది.

Read Also: IPL 2024: ఎయిర్‌పోర్టులో అభిమానులపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వేలు చూపిస్తూ మరీ..!

పాకిస్తాన్‌లో భారత్ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ది గార్డియన్‌లో వచ్చిన నివేదికపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజు పాకిస్తాన్ స్పందించింది. ‘‘దేశ శాంతికి విఘాతం కలిగించడానికి ఎవరైనా ఉగ్రవాది ప్రయత్నిస్తే మేము తగిన సమాధానం ఇస్తాము. ఉగ్రవాదులు పాకిస్తాన్ తిరిగి పారిపోతే, మేం అక్కడికి వెళ్లి వారిని చంపేస్తాము’’ అని రా‌జ్‌నాథ్ సింగ్ అన్నారు.

భారత్ ఎప్పుడూ కూడా ఏ దేశంపై దాడి చేయలేదు, వారి భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించలేదు, కానీ ఎవరైనా భారత్‌పై దాడికి ప్రయత్నిస్తే, శాంతిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. భారత్ ఈ విధంగా స్పందించేంత శక్తివంతంగా ఉందని, పాకిస్తాన్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించిందని ఆయన అన్నారు. బ్రిటీష్ వార్తా పత్రిక ది గార్డియన్ నివేదిక ప్రకారం.. భారత్, పాకిస్తాన్‌‌లో టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడుతోందని ఆరోపించింది. అయితే, కేంద్ర ఈ వాదనల్ని తప్పుడు, హానికరమైన భారత వ్యతిరేక ప్రచారంగా తిరస్కరించింది. ఇతర దేశాల్లో టార్గెట్ కిల్లింగ్స్ భారత లక్ష్యం కానది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.