Site icon NTV Telugu

India-Pakistan: ఇరాన్‌లో ఇండియన్స్ కిడ్నాప్ వెనక పాకిస్తాన్ హస్తం ఉందా..

Iran

Iran

India-Pakistan: ఇటీవల ఇరాన్‌లో కనిపించకుండా పోయిన ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌లో పాకిస్తాన్ హస్తం ఉందా.? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సంగ్రూర్‌కు చెందిన హుషాన్‌ప్రీత్ సింగ్, ఎస్‌బిఎస్ నగర్‌కు చెందిన జస్పాల్ సింగ్, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు మే 1న టెహ్రాన్‌తో దిగిన కొద్దిసేపటికి అదృశ్యమయ్యారు.

Read Also: Nara Lokesh: వాస్తవాలను మరుగున పెట్టి మాపై బురద జల్లడం సిగ్గుచేటు.. జగన్‌పై లోకేష్ ఆగ్రహం..!

అయితే, అదృశ్యమైన వ్యక్తుల్ని ఐఎస్ఐ భారత్ గూఢచారులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించవచ్చని నివేదిక సూచిస్తున్నాయి. బాధితులను ఇరాన్ ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతామని హామీ ఇచ్చారు. వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తులను పంజాబ్‌లోని ఓ ఏజెంట్ ఆకర్షించి దుబాయ్, ఇరాన్ ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని హామీ ఇచ్చారు. హోషియార్‌పూర్ లో ఉన్న ఈ ఏజెంట్ ప్రస్తుతం కనిపించకుండాపోయాడు. పాకిస్తాన్ ప్రభుత్వం లేదా ఐఎస్ఐతో ఏవైనా సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా దర్యాప్తు జరుగుతోంది. విదేశీ మోజులో ఉన్న యువతను తప్పుదారి పట్టించే ఒక మానవ అక్రమ రవాణా నెట్వర్క్‌ని ఈ కేసు బహిర్గతం చేస్తోంది.

ముగ్గురు అదృశ్యంపై ఇరాన్ అధికారులతో భారత అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న కుల్‌ భూషన్ జాదవ్‌ని ఇలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి భారత గూఢచారిగా ముద్ర వేసింది. దీంతో ఇప్పుడు ఈ ముగ్గురి అదృశ్యం సంచలనంగా మారింది.

Exit mobile version