India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!

  • ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్ వస్తున్న పాకిస్తాన్ మంత్రి..
  • న్యూఢిల్లీలో జరిగే SCO సివిలైజేషనల్ డైలాగ్ కార్యక్రమానికి హాజరు..
Pak Ministar

Pak Ministar

India-Pakistan: భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. పాకిస్తాన్ మంత్రి భారత పర్యటనకు రాబోతున్నారు. ఆ దేశ వాతావరణ మార్పుల శాఖ మంత్రి డాక్టర్ ముసాదిక్ మసూద్ మాలిక్ నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సివిలైజేషనల్ డైలాగ్‌లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ నవంబర్ 14న అధికారికంగా ప్రకటించింది.

2025 మేలో ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన ఒక కేంద్ర మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. దీనికి ముందు 2023లో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గోవాలో జరిగిన SCO విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన కేంద్ర మంత్రి భారత్‌లో పర్యటించలేదు.

SCOలో సభ్యత్వం ఉన్న దేశాలన్నింటికీ ఈ సమావేశానికి ఆహ్వానాలు పంపినట్లు భారత్ అక్టోబర్ 28న ప్రకటించింది. పాకిస్థాన్‌తో పాటు మొత్తం పది SCO సభ్య దేశాలను భారత్ ఆహ్వానించింది. ఈ కార్యక్రమం ద్వారా సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, నాగరికత వారసత్వంపై చర్చలకు అవకాశం కల్పించాలనేదే దీని ఉద్దేశం. పాకిస్తాన్‌ ఈ సమావేశానికి ఎవరిని పంపుతారనే దానిపై ముందు స్పష్టత లేదు, తాజాగా ఆ దేశం ముసాదిక్ మాలిక్ పేరును ప్రకటించింది.