పాకిస్తాన్‌ను ఎన్ని సార్లు హెచ్చరించినా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. మత్స్యకారులపై కాల్పులు జరపొద్దని నిబంధనలు ఉన్న వాటిని పాకిస్తాన్ బేఖాతరు చేస్తుంది. భారత్‌కు చెందిన చేపల వేట పడవ ‘జల్‌పరి’ పై పాకిస్థాన్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని ద్వారక వద్ద ఆదివారం ఉదయం జరిగింది. చనిపోయిన మత్స్యకారుడి పేరు శ్రీధర్‌గా గుర్తించారు. మరో వ్యక్తి కూడా ఈ కాల్పు ల్లో గాయపడ్డారు. పలువురు మత్స్యకారులను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు వార్తలొస్తున్నా.. వాటిని అధికారులు ధ్రువీకరించలేదు.
గతంలో కూడా పలుమార్లు భారత మత్స్యకారులపై పాక్ నేవీ దాడులకు పాల్పడింది. ఈ ఏడాది మార్చిలో 11 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ అరెస్టు చేసి రెండు బోట్లను స్వాధీనం చేసుకొంది. ఫిబ్రవరిలో 17 మందిని అదుపులోకి తీసుకొని, మూడు బోట్లను స్వాధీనం చేసుకొంది. ఈ ఘటన భారత జలాల్లోనే జరిగినట్లు భావిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత పాక్ కాల్పుల్లో ఒక మత్స్య కారు డు మరణించాడు. సాధారణ మత్స్యకారుల పడవల్లో సరిహద్దులు గుర్తించే ఆధునిక పరికరాలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మత్స్య కారులకు సరైన ఆధునిక పరికరాలు గల పడవలను ఇప్పించాలి లేదంటే ఈ ఘటనలు పునారావృతం అవుతునే ఉంటాయి.