Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య బలపడుతున్న సంబంధాలు భారత్‌కు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. షేక్ హసీనా గతేడాది పదవీచ్యుతి తర్వాత ఆమె భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా మారారు. అప్పటి నుంచి అతను పాకిస్తాన్‌తో సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కొన్ని రోజులుగా పాకిస్తాన్‌కు చెందిన కీలక సైనికాధికారులు, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా, ఐఎస్ఐ అధికారులు భారత సరిహద్దుల్లో పర్యటించడం ప్రమాదకరంగా మారింది.
ఇదిలా ఉంటే, . పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, నేవీ చీఫ్ చైర్‌పర్సన్, ISI హెడ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ వరకు అందరూ కూడా బంగ్లాదేశ్‌ను మంచిక చేసుకునేందుకు వరసగా ఆ దేశంలో పర్యటిస్తున్నారు. అయితే, భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకున్నట్లుగానే, బంగ్లాదేశ్‌తో రక్షణ ఒప్పందం చేసుకోవాలని పాకిస్తాన్ చూస్తోంది. సెప్టెంబర్‌లో సౌదీ అరేబియాతో పాకిస్తాన్ పరస్పర రక్షణ ఒప్పందాన్ని చేసుకుంది. ఒక దేశంపైన శత్రుదేశం దాడి చేస్తే, దానిని రెండు దేశాలపై జరిగే దాడిగా చూస్తామని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇప్పుడు బంగ్లాతో రక్షణ ఒప్పందం చేసుకుని భారత్‌ను ఇరుకున పెట్టాలని పాక్ భావిస్తోంది.
1971 బంగ్లాదేశ్ ఏర్పాటు తర్వాత, తొలిసారిగా పాకిస్తాన్‌తో దాని సంబంధాలు బలపడుతున్నాయి. విచిత్రం ఏంటంటే, ఏ పాకిస్తాన్ అయితే బంగ్లాదేశ్ ప్రజలపై అకృత్యాలకు పాల్పడిందో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని ఒక వర్గం పాకిస్తాన్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నారు. రెండు నెలల్లో అంటే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈలోపే ఒప్పందాన్ని ముగించాలని పాక్ కోరుకుంటోంది.
రెండు దేశాల మీడియా చెబుతున్న దాని ప్రకారం.. ప్రతిపాదిత ఒప్పందాన్ని రూపొందించడానికి ఇప్పటికే రెండు దేశాలు ఉమ్మడి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ఒప్పందంపై సంతకం చేస్తే, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ అధికారికంగా నిఘా సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడం మరియు ఆయుధ ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే, ఈ ఒప్పందంలో అణు సహకారం ఉంటుందా? లేదా? అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
భారత్‌కు డేంజర్ బెల్స్:
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న సంబంధాలు భారత్‌కు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు పశ్చిమ, తూర్పు సరిహద్దుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇదిలా ఉంటే, బంగ్లాపై భారత్ దాడి చేస్తే పాక్, భారత్‌పై దాడులు చేస్తుందని పాకిస్తాన్‌లోని అధికార ముస్లింలీగ్ పార్టీకి చెందిన కమ్రాన్ సయీద్ ఉస్మానీ హెచ్చరించడం చూస్తుంటే, రెండు దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థం అవుతోంది. పాక్, బంగ్లాల మధ్య సైనిక భాగస్వామ్యం ప్రాంతీయ శక్తిని గణనీయంగా మారుస్తుంది. ఏదైనా సంఘర్షణ తలెత్తితే, భారత్ టూ ఫ్రంట్ వార్ చేయాల్సి వస్తుంది.
