Operation Sindoor: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకినట్లు ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిడ్కే లోని లష్కరే తోయిబా, బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధానకార్యాలయాలను పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో, పీఓకేతో పాటు భారత సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తమ స్థావరాలను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ ఫఖ్తుంఖ్వా(కేపీకే) ప్రావిన్సుల్లోకి మారుస్తున్నాయి. పీఓకే ప్రస్తుతం, భారత నిరంతర పరిశీలలో ఉన్నందున ఉగ్రవాద సంస్థలు, భారత సరిహద్దుకు దూరంగా వెళ్తున్నాయి. పూర్తిగా కొండలు, లోయలతో కూడిన కేపీకే ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా ఉంది.
ఇటీవల జైషే మహ్మద్ పాక్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి 190 కి.మీ దూరంలో ఉన్న మన్సెహ్రా జిల్లాలోని గర్హి హబీబుల్లాలో ఒక మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం టెర్రర్ నియామకాలు. ఈ కార్యక్రమానికి జైషే కీలక కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వచ్చాడు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాన్ని ఉగ్రవాదానికి కంచుకోటగా మారుస్తానని అన్నారు. జైషే మహ్మద్ ఇప్పుడు సెప్టెంబర్ 25 కేపీకే రాజధాని పెషావర్‌లో పెద్ద సమావేశానికి రంగం సిద్ధం చేస్తోంది.
మరోవైపు, హిబ్బుల్ ముజాహిదీన్ కూడా కేపీకేలో తమ కొత్త స్థావరాలను నిర్మించుకునే పనిలో ఉంది. ఇస్లామాబాద్‌కు 250 కి.మీ దూరంలో లోయర్ దిర్ జిల్లాలోని బందాయ్ లో ఒక శిక్షణా శిబిరాన్ని స్థాపించింది. దీనికి HM 313 అని పేరు పెట్టారు. ఖైబర్ ప్రాంతంలో ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఉన్నాడు. పీఓకేలోని రావల్ కోట్ లో జన్మించిన ఇతను 2001లో జైషే మహ్మద్‌లో చేరాడు. 2000ల ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌లో నాటో దళాలతో పోరాడిన ఆయన 2018లో జమ్మూలో సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్ దాడికి సూత్రధారి.
