Site icon NTV Telugu

Asaduddin Owaisi: ‘‘ వాళ్ల ఇంట్లోకి దూరి..’’ పీఓకేపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదంపై తరుచుగా చెప్పే ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’ అనే దానికి బదులుగా ‘‘ వాళ్ల ఇంట్లోకి ప్రవేశించి అక్కడే ఉండాలి, అంతే’’ అని కేంద్రానికి అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ భయానికి ఖాళీచేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ వారు ఖాళీ చేసి ఉంటే, మనం వెళ్లి అక్కడే ఉండాలి. ఈసారి మీరు(కేంద్ర ప్రభుత్వం) ఏదైనా చర్య తీసుకుంటే, వాళ్ల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి’’ అన్నారు.

Read Also: Jagga Reddy: దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో.. తెలంగాణలో రేవంత్..

పీఓకే భారతదేశానికి చెందిందనే పార్లమెంట్ తీర్మానం ఉందని ఓవైసీ గుర్తు చేశారు. ఉగ్రవాదం అంతం కావాలని ఆయన అన్నారు. పాకిస్తాన్‌పై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడులు అమాయకపు ప్రజలు ప్రాణాలను బలిగొంటున్నాయని అన్నారు. ‘‘లుంబినీ పార్క్, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు జరిగాయి. నాకు ఒక శర్మ జీ తెలుసు. ఆయన ఒక తెలుగు పండితుడు. ఆయన కూతురిని ఉగ్రవాద దాడిలో కోల్పోయారు. కొన్ని సార్లు ఆయన నన్ను వచ్చి కలుస్తారు. అతను తన కుమార్తెని మిస్ అవుతున్నానని చెబుతారు. ముంబైలో 26/11 సంఘటనలో ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో నిజామాబాద్‌కి చెందిన ఒక వధువు హత్యకు గురైంది. ఆమె చేతుల గోరింటాకు కూడా అలాగే ఉంది. పుల్వామా, ఉరి, పఠాన్ కోట్, రియాసి ఇలా ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం వీటిని ముగించాలి’’ అని ఓవైసీ అన్నారు.

దీనికి ముందు పాకిస్తాన్ అణ్వాయుధాల బెదిరింపులపై ఓవైసీ విమర్శించారు. ‘‘పాకిస్తాన్ ఎల్లప్పుడూ అణ్వాయుధ శక్తి గురించి మాట్లాడుతుంది, వారు ఒక దేశంలోకి ప్రవేశించి అమాయక ప్రజలను చంపితే, ఆ దేశం నిశ్శబ్దంగా కూర్చోదని వారు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ఏదైనా సరే, మన భూమిపై మన ప్రజలను చంపి, మతం ఆధారంగా వారిని లక్ష్యంగా చేసుకుని చంపుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు. పాక్ ఐసిస్‌లా ప్రవర్తిస్తుంది’’ అని ధ్వజమెత్తారు. పాక్ రాజకీయ నేత బిలావల్ భుట్టో భారత్‌పై చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, బిలావల్ భుట్టో తల్లి పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ని ఉగ్రవాదులే చంపారనే విషయాన్ని ఓవైసీ గుర్తు చేశారు. పాకిస్తాన్ భారత్ కంటే కేవలం ఒక గంట వెనకబడి ఉండటమే కాదు, అర్ధ శతాబ్ధం వెనకబడి ఉందని అన్నారు.

Exit mobile version