Site icon NTV Telugu

Monkeypox Vaccine: కలవరపెడుతోన్న మంకీపాక్స్.. వ్యాక్సిన్‌పై భారత్‌ ఫోకస్..!

Monkeypox Vaccine

Monkeypox Vaccine

ఓవైపు కరోనా మహమ్మారి భయం వెంటాడుతూనే ఉండగా.. ఇప్పుడు మంకీపాక్స్ కేసులు టెన్షన్‌ పెడుతున్నాయి.. రోజురోజుకు మంకీపాక్స్‌ కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 16వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో.. మంకీపాక్స్‌కు వ్యాక్సిన్‌తో చెక్‌ పెట్టేందుకు భారత్‌ సిద్ధం అవుతోంది.. మంకీపాక్స్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఫార్మా కంపెనీలు కేంద్రంతో చర్చలు ప్రారంభించాయి.. వ్యాక్సిన్ తయారీ కోసం ఔషధ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ ప్రకటించారు.. భవిష్యత్తులో మంకీపాక్స్ వ్యాక్సిన్ కోసం అవసరమైతే ప్రైవేట్ వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తామంటోంది నీతి ఆయోగ్..

Read Also: Good News Soon to Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..!

“మంకీపాక్స్‌కి ప్రత్యేకంగా అలాంటి వ్యాక్సిన్ లేదు.. ఇంతకుముందు స్మాల్ పాక్స్‌కి టీకా ఉంది. కాబట్టి, మేం ఆ అంశాన్ని పరిశీలిస్తున్నాం.. ఏదో ఒక సమయంలో వ్యాక్సిన్ అవసరమైతే, తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం.. దాని కోసం ప్రయత్నాలు ప్రారంభించామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు.. అయితే, అధికారిక సమాచారం ప్రకారం.. రెండు భారతీయ ఫార్మా కంపెనీలు మంకీపాక్స్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేయడం కోసం ప్రభుత్వంతో చర్చల్లో నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు, వ్యాక్సిన్ పంపిణీ అనివార్యమైన తరుణంలో దీనిని దిగుమతి చేసుకునేందుకు డెన్మార్క్ కు చెందిన సంస్థతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్లు సంస్థ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు.. మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం స్మాల్ పాక్స్ ను ఎదుర్కొనే టీకానే డెన్మార్క్ కు చెందిన బవారియన్ నార్డిక్ అనే సంస్థ తయారు చేసిందని.. ఇది వివిధ పేర్లతో అమెరికా, యూరప్ దేశాల మార్కెట్ లలో అందుబాటులోకి తెచ్చాయని.. మంకీపాక్స్ కు ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేకపోయినా.. స్మాల్ పాక్స్ కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ నే మంకీపాక్స్ నిరోధానికి ఆయా దేశాలు అనుమతించినట్టు చెబుతున్నారు.

ఇక, కోతుల ద్వారా మంకీపాక్స్‌ వ్యాప్తిపై నిఘా పెట్టినట్టు డాక్టర్ పాల్ తెలిపారు.. అయితే, మంకీపాక్స్‌ను ప్రజలు దాచిపెట్టి చికిత్స చేసుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు.. విదేశీ ప్రయాణ చరిత్ర లేని వ్యక్తులలో మంకీపాక్స్‌ను గుర్తించడంపై అడిగినప్పుడు, ఈ వ్యాధి యొక్క పూర్తి ఎపిడెమియాలజీ ఇంకా అధ్యయనం చేయబడుతుందని డాక్టర్ పాల్ చెప్పారు. మేం ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో వ్యాధి యొక్క పూర్తి ఎపిడెమియాలజీని అర్థం చేసుకుంటున్నాం.. కానీ, మన దేశంలో కొన్ని కేసులను మాత్రమే చూశాం.. కాబట్టి, వ్యాధి ఎలా వ్యాపిస్తుందనే దానిపై పూర్తిస్థాయిలో వెల్లడించడం సరైంది కాదన్నారు. గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్ వైరస్ సంక్రమణకు సంబంధించిన నాలుగు కేసులను ఇప్పటికే భారత్‌లో గుర్తించిన విషయం తెలిసిందే.

Exit mobile version