Oscar Entry Chellow Show Child Actor Rahul Koli Died With Cancer: సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను సైతం వెనక్కు నెట్టి.. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఛెల్లో షో (ద లాస్ట్ షో) సినిమాలో అద్భుత నటన కనబర్చిన బాల నటుడు రాహుల్ కోలీ (15) క్యాన్సర్‌తో మృతి చెందాడు. రిపోర్ట్స్ ప్రకారం.. పదే పదే జ్వరం బారిన పడుతున్న రాహుల్, ఇటీవల రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో, వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. ఈ నెల 14వ తేదీన తాము ఛెల్లో షో సినిమా చూడాలనుకున్నామని, కానీ ఇంతలోనే తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ.. రాహుల్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రాహుల్ అంత్యక్రియలు పూర్తయ్యాక.. తమ కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్‌లో సినిమా చూస్తామని ఆయన పేర్కొన్నాడు.
తండ్రి రాము కోలీ మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 2వ తేదీన రాహుల్ ఉదయాన్నే టిఫిన్ చేశాడు. ఆ కొన్ని గంటల్లోనే అతడు తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. అప్పట్నుంచి అతడు కోలుకోలేదు. ఆ తరువాత మూడు సార్లు రక్తపు వాంతులు చేసుకున్నాడు. మేము అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. కళ్ల ముందే మా బిడ్డ చనిపోయాడు. కుమారుడి మరణవార్తతో మా ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ మేమంతా అతని అంతక్రియలు పూర్తి చేశాక, అక్టోబర్ 14వ తేదీన ఛెల్లో షో సినిమా చూస్తాం’’ అని చెప్పుకొచ్చారు. కాగా.. సినిమా మీద అమితమైన ప్రేమ కలిగిన ఓ తొమ్మిదేళ్ల యువకుడి జీవితం ఎలా సాగిందన్న నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు పిల్లలు నటించగా.. వారిలో రాహుల్ కోలీ ఒకడు. ఈ బాల నటుడి హఠాన్మరణంతో షాక్‌కి గురైన సెలెబ్రిటీలు, అతని మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.