BJP VS INDIA: ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం వివాదాస్పదమైంది. గణేష్ పూజ కోసం వెళ్లడం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమైంది. విపక్ష నేతలు దీనిని తప్పుపడుతున్నారు. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లుతుందని చెబుతున్నారు. అయితే, గణపతి పూజకు వెళ్లడం నేరం కాదని, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో అనేక వేదికలను కలిసి పంచుకున్నారని అధికార బీజేపీ ఎదురుదాడి చేసింది.
గణేష్ పూజ కోసం ప్రధాన న్యాయమూర్తి ఇంటికి మోడీ వెళ్లడంతో ఆయన భార్య కల్పనా దాస్ నుంచి ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ‘‘ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ జీ నివాసంలో గణేష్ పూజకు హాజరయ్యాను. భగవాన్ గణేష్ మనందరికి ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకున్నానున’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సీజేఐ, ఆయన భార్యతో ఉన్న ఫోటోని ప్రధాని పంచుకున్నారు.
దీనిపై శివసేన(యూబీటీ) నేత సంజయ్మ రౌత్ మాట్లాడుతూ.. భేటీపై సందేహాలను లేవనెత్తారు. శివసేన, ఏక్ నాథ్ షిండే మధ్య జరుగుతున్న శివసేన గొడవకు సంబంధించిన కేసు నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పుకోవాలని సూచించారు. ‘‘చూడండి.. ఇది గణపతి పండుగ.. ప్రధాని ఇప్పటి వరకు ఎంత మంది ఇళ్లకు వెళ్లారో.. నాకు సమాచారం లేదు.. ఢిల్లీలో చాలా చోట్ల గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ ప్రధాని మాత్రం చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్లి.. ప్రధానమంత్రి మరియు ప్రధాన న్యాయమూర్తి కలిసి ఆరతి చేసారు, రాజ్యాంగ పరిరక్షకులు రాజకీయ నాయకులను ఈ విధంగా కలుస్తుంటే, ప్రజలకు సందేహాలు కలుగుతాయి, ” అని సంజయ్ రౌత్ అన్నారు.
Read Also: Natasha’s Friend: స్నేహితుడితో కారులో నటాషా.. హార్దిక్ తో విడిపోవడానికి కారణం అతడేనా?
ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన మరో ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా ఈ భేటీపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. శివసేనకు సంబంధించిన కేసు పదేపదే వాయిదా పడటాన్ని ఎత్తి చూపారు. ‘‘ గణపతి పూజ వ్యక్తిగత విషయం, కానీ మీరు కెమెరా ముందుకు తెస్తున్నారు. అది పంపే సందేశం అసౌకర్యంగా ఉంటుంది. ’’ అని ఆర్జేడీ నాయకులు, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.
2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు అప్పటి భారత ప్రధాని న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరైన విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. “గణేష్ పూజకు హాజరు కావడం నేరం కాదు. చాలా సందర్భాలలో న్యాయవ్యవస్థ మరియు రాజకీయ నాయకులు వేదికను పంచుకుంటారు. శుభకార్యాలు, వివాహాలు, కార్యక్రమాలలో – కానీ ప్రధానమంత్రి సిజెఐ ఇంటికి హాజరవుతుంటే, ఉద్ధవ్ సేన ఎంపి సిజెఐ మరియు సుప్రీం కోర్టు యొక్క చిత్తశుద్ధిని అనుమానించారు. కాంగ్రెస్ ఎకో సిస్టమ్ దీనిపై దాడి చేస్తోంది. గతంలో రాహుల్ గాంధీ లాగానే సుప్రీంకోర్టుపై దాడి చేస్తోంది. ఇది కోర్టు ధిక్కారం, న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడం’’ అని పూనావాలా అన్నారు.