NTV Telugu Site icon

MLC Kavitha: కవితకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మద్దతు.. దీక్షకు హాజరుకానున్న 16 పార్టీల ప్రతినిధులు..

Kavitha

Kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న ఈడీ ముందు ఆమె హాజరుకాబోతున్నారు. మరోవైపు రేపు జంతర్ మంతర్ వేదికగా మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ..కవిత దీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు.

Read Also: Spy Pigeon: ఒడిశా తీరంలో గూఢచార పావురం కలకలం.. కెమెరా, మైక్రోచిప్‌తో సెటప్..

ఇప్పటికే కవిత దీక్షకు పలు పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. దీక్షకు సంఘీభావంగా బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆకలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సిపిఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. వీరితో పాటు స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా హాజరుకానున్నారు. జంతర్ మంతర్ వేదికగా విపక్షాలు బలపదర్శన చేయనున్నాయి.

“భారత్ జాగృతి” ఆధ్వర్యంలో రేపు నిరాహార దీక్ష చేయనున్నారు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఆమోదించాలనే డిమాండ్ తో నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతారాం ఏచూరి, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంకా చతుర్వేది హాజరుకానున్నారు. ముగింపు కార్యక్రమానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, తృణమూల్ కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్, జేడీయూ నేత త్యాగి హాజరుకానున్నారు. నిరాహార దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. దీని తర్వాత జంతర్ మంతర్ వద్ద దీక్షాస్థలిని పరిశీలిస్తారు, ఆ తరువాత సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

Show comments