Dharmendra Pradhan Resign: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీనిని విద్యార్థి విజయంగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. విద్యార్థుల భవిష్యత్తు ఎలాంటి రాజకీయ, న్యాయపరమైన వివాదాల్లో్ చిక్కుకోవద్దని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే ప్రతిపక్ష పార్టీలు, నేతలు స్పందించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్‌లో స్పందిస్తూ.. “యువత విజయం. అహంకారియైన ప్రధానమంత్రి, ప్రభుత్వం తలవంచక తప్పలేదు” అని పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు కొనసాగిస్తున్న నిరసనలు, పెరుగుతున్న ప్రజా ఒత్తిడి కారనంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చెప్పింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతించారు. “కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వార్త నాకు ఇప్పుడే అందింది. నేను ఈ రాజీనామాను స్వాగతిస్తున్నాను. ఇది ప్రస్తుత ఉద్రిక్తతను తగ్గించి, పార్లమెంటు లోపల, వెలుపల విద్యా వ్యవస్థకు సంబంధించిన కీలక సమస్యలపై తీవ్రమైన చర్చకు మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నాను.” అని ఎక్స్‌లో రాశారు. అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని అన్నారు. సుప్రియా సూలే నిరసనకారులకు శుభాకాంక్షలు తెలిపారు. భూపేష్ బాఘెల్ ఇది యువత విజయమని అన్నారు.

