Open Doors App From True Caller: ఒకప్పటిలా సామాజిక చర్చావేదికలు ఇప్పుడు లేవు. అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. కరోనా లాక్డౌన్ కారణంగా బయట కలవడానికి వీలు లేనప్పుడు, ఇంట్లోనే కూర్చొని అందరూ ఆన్‌లైన్‌లో కాంటాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. దీన్నే క్యాష్ చేసుకుంటూ.. క్లబ్ హౌస్ యాప్ వచ్చింది. తెలిసిన వాళ్లు, అపరిచితులంటూ తేడా లేకుండా.. అందరూ ఈ యాప్‌లో తిష్ట వేయడం స్టార్ట్ చేశారు. ఈ యాప్‌కి అనతికాలంలోనే గణనీయంగా ఆదరణ రావడంతో.. ట్విటర్ సైతం ‘ట్విటర్ స్పేసెస్’ను పరిచయం చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు సైతం.. ఇదే తరహా ఫీచర్లు తీసుకొస్తున్నట్టు వెల్లడించాయి. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా ట్రూకాలర్ చేరింది. ఓపెన్ డోర్స్ పేరుతో వాయిస్ ఆధారిత యాప్‌ను లాంచ్ చేసింది.
క్లబ్‌హౌస్ తరహాలోనే ఇందులో యూజర్లు తమ స్నేహితులు, పరిచయస్తులతో సంభాషణలు జరుపుకోవచ్చు. ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాక, ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేసేందుకు అనుమతించాల్సి ఉంటుంది. దాంతో మీ కాంటాక్ట్స్ జాబితాలోని వారు ఓపెన్ డోర్స్ ద్వారా చర్చలోకి పాల్గొనప్పుడు మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి, మీరు కూడా ఆ సంభాషణల్లో పాల్గొనవచ్చు. ఈ యాప్ ఆల్రెడీ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సంభాషణలు జరిపే సమయంలో యూజర్ల ఫోన్ నంబర్లు ఇతరులు చూడలేరని, దీని వల్ల యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని సంస్థ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, లాటిన్, ఫ్రెంచ్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.