Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!

Ration Card

Ration Card

Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ‘ఒకే దేశం – ఒకే రేషన్ కార్డు’ (ONORC) పథకం కింద కీలక మార్పులు అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, అర్హులైన లబ్ధిదారులు ఇకపై దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఫెయిర్ ప్రైస్ షాప్ నుంచైనా తమ రేషన్‌ను పొందవచ్చు. ఒకే రేషన్ దుకాణంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా ధాన్యాన్ని సేకరించుకునే అవకాశం కల్పించింది.

ప్రస్తుతం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద కోట్లాది మంది ప్రజలు రాయితీ ధరకే బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పొందుతున్నారు. ఈ కొత్త విధానంతో లబ్ధిదారులు ఒక దుకాణం నుంచి బియ్యం, మరో దుకాణం నుంచి గోధుమలు తీసుకునే వెసులుబాటు పొందనున్నారు. సరుకుల కొరత, సాంకేతిక సమస్యలు లేదా అధిక రద్దీ కారణంగా రేషన్ పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి.

ఈ విధానం బ్యాంకింగ్ వ్యవస్థలోని ఏటీఎం సేవల మాదిరిగానే పనిచేస్తుంది. బ్యాంకు ఖాతా ఎక్కడ ఉన్నా దేశంలోని ఏ ఏటీఎం నుంచైనా నగదు తీసుకునే విధంగా, రేషన్ కార్డుదారులు కూడా తమకు అనుకూలమైన ఏ రేషన్ దుకాణం నుంచైనా ధాన్యాన్ని పొందవచ్చు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

ముఖ్యంగా వలస కార్మికులు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. తమ స్వగ్రామంలోని రేషన్ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోనే రేషన్ పొందే అవకాశం కలగనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఆహార భద్రత మరింత బలోపేతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.