NTV Telugu Site icon

PM Modi: “దాణా కుంభకోణంలో దోషి ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తున్నాడు”.. లాలూపై మోడీ ఫైర్..

Modi

Modi

PM Modi: ఇటీవల ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. బీహార్‌లో జంగిల్ రాజ్‌ని తీసుకువచ్చిన వ్యక్తి, దాణా కేసులో నిందితుడైన వ్యక్తి దళితులు, వెనకబడిన వారి రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని వాదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. హాజీపూర్‌లో ఈ రోజు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఎన్నికలను ప్రజాస్వామ్యానికి పెద్ద పండగా అభివర్ణించిన మోడీ, ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేయాలని కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజలు కాదని, వారి సొంత ఓటు బ్యాంకు అని ఆరోపించారు. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు బుజ్జగింపులనే తమ అస్త్రాలుగా చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాణా కుంభకోణంలో దోషిగా తేలిని వ్యక్తి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతున్నాడని అన్నారు. మోడీ జీవించి ఉన్నంత కాలం రిజర్వేషన్లను దోచుకోలేరని చెప్పారు. మీరు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పేపర్లను చించేసిన కాలం పోయిందని ప్రధాని అన్నారు. అంతకుముందు మే 7వ తేదీని లాలూ మాట్లాడుతూ.. ముస్లింకోటాకు మద్దతుగా నిలిచారు. ముస్లింలకు పూర్తిగా రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.

Read Also: Road Accident: కోతి వల్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల దుర్మరణం..

బీహార్‌ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆలోచన ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు లేదని ప్రధాని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ఓటేయడం వృథాగా అభివర్ణించారు. బీహార్ ప్రజలు మేధావులని, కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ ఓటు వేయండి అని, దేశం, మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అని ప్రధాని ఓటర్లను కోరారు. కేంద్రంలో ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వాలను నడుపుతున్నప్పుడు 10 ఏళ్లలో రూ. 35 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకుంటే, మోడీ ప్రభుత్వం దొంగల ఇంట్లో నుంచి రూ. 2250 కోట్లను స్వాధీనం చేసుకుందని చెప్పారు.

ఈ రోజుల్లో ఇండియా కూటమి ప్రతిపక్షాల రామ మందిరం గురించి నీచమైన మాటలు మాట్లాడేవారని, రామ మందిరం గురించి అవహేళన చేస్తూ మాట్లాడేవారని, చివరకు రామ మందిర ప్రారంభోత్సవాన్ని కూడా బహిష్కరించారని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ గెలిచినప్పుడే రామ్ విలాస్ పాశ్వాన్‌కి నివాళి లభిస్తుందని అన్నారు. చిరాగ్ పాశ్వాన్‌ను గెలిపించడానికి, రామ్‌విలాస్‌ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానని ప్రధాని అన్నారు. బీహార్ లోని 40 స్థానాల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.

Show comments