NTV Telugu Site icon

Manipur: మణిపూర్‌లో శివాలయంపై దుండగుల దాడి..

Manipur

Manipur

Manipur: గతేడాది కాలంలో మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. ఈ రెండు తెగల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు మతం రంగును పులుముకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో కొందరు వ్యక్తులు రాత్రిపూట శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోకి చొరబడి శివాలయానికి నిప్పటించారు. దీంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. రెండు వారాల వ్యవధిలో ఆలయంపై రెండోదాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆలయం మంటలు వ్యాపించడం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

Read Also: JK Polls: జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పోలింగ్

మంటలు వ్యాపించకుండా స్థానికులు చర్యలు తీసుకున్నారు. నాగా పీపుల్స్ ఆర్గనైజేషన్ (NPO), కరోంగ్-సేనాపతి టౌన్ కమిటీ (KSTC) దుండగుల చర్యల్ని ఖండించారు. శ్రీ శ్రీ పశుపతి నాథ్ మందిరాన్ని తగలబెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. సేనాపతి శాంతియుతంగా ఉండే పట్టణమని, ఇక్కడ ప్రతీ ఒక్కరూ తమ మతాన్ని ఆచరిస్తారని, సామాజిక ప్రశాంతతని విచ్ఛిన్నం చేసే ఏ చర్యనైనా ఖండిస్తామని రెండు సంస్థలు ప్రకటించాయి. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు.

మెయిటీ, కుకీ తెగల హింసాత్మక ఘటనల మధ్య మతపరమైన, జాతి ఉద్రిక్తల్ని సృష్టించేందుకు దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆలయంపై దాడిని మణిపూర్ రాజ్యసభ ఎంపీ మహారాజా సనజయోబా లీషెంబా ఎక్స్‌లో ఖండించారు. లౌకికవాదానికి విఘాతం కలిగించే ఏ చర్యనైనా ఖండించాల్సిందే అని, దోషులపై కేసులు నమోదు చేయాలని ట్వీట్ చేశారు. రాష్ట్రవాప్యంగా కుకీ మెయిటీ సమస్య ఉన్నప్పటి సేనాపతి మాత్రం ప్రశాంతంగా ఉండని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. గతేడాది నుంచి జరిగిన ఘర్షణల్లో 200 మంది మరణించారు. దాదాపు 50,000 మంది ఇళ్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లారు.