జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా సంచలన ఆరోపణలు చేశారు. ఎన్‌సీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.20–30 కోట్ల ఆఫర్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది.
ఏం ఆరోపించారంటే..
శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్‌లో నిర్వహించిన ‘‘మదర్-ఎ-మెహర్బాన్ డే’’ సభలో మాట్లాడిన ఓమర్ అబ్దుల్లా.. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా, మంత్రి పదవి, అలాగే రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు నగదు ఇస్తామని ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. ‘‘డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపించి మా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మా సహనాన్ని, మర్యాదను పరీక్షించవద్దు.’’ అని కేంద్ర ప్రభుత్వం, బీజేపీని హెచ్చరించారు. జమ్మూ ప్రాంతానికి చెందిన తమ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేను బీజేపీకి అనుబంధంగా ఉన్న ఓ సుప్రీంకోర్టు న్యాయవాది సంప్రదించారని ఓమర్ ఆరోపించారు. ‘‘మాతో చేరితే ఒక మంత్రి పదవి, రూ.20-30 కోట్లు, అలాగే రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు.’’ అని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులు ఎవరూ డబ్బుకు అమ్ముడుపోరని స్పష్టం చేశారు.
బీజేపీ ఖండన
ఓమర్ అబ్దుల్లా ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత రవీందర్ రైనా తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవమని, ప్రజల దృష్టిని ప్రభుత్వం వైఫల్యాల నుంచి మళ్లించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘ఓమర్ అబ్దుల్లా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వివాదాలు సృష్టించడం అలవాటుగా మార్చుకుంది.’’ అని రైనా అన్నారు. ఇటీవల ప్రధాని మోడీ సహకారం లేకపోతే జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడేదని ఓమర్ స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఓమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై పరువు నష్టం కేసుతో పాటు ఇతర న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారం జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీసింది.
#WATCH | Srinagar, Jammu and Kashmir: Chief Minister Omar Abdullah says, "Where your (BJP) greed for money and ministries failed, you're telling my MLA in a closed room, "Come with us. When you come, we'll give you a statehood." A Supreme Court lawyer, a BJP official, tells one… pic.twitter.com/yG7rlbt82H
— ANI (@ANI) July 11, 2026

