ఒడిశాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఒడిశాలోని పూరిలో ఒక మహిళ చనిపోయి తిరిగి బతికిన వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ మరణించిన తర్వాత అకస్మాత్తుగా తిరిగి బ్రతికడంతో.. వారు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పూర్తి వివారాల్లోకి వెళితే.. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన 86 ఏళ్ల వృద్ధురాలు ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు.పూరి శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఆమెను చితికి పెట్టే ముందు, ఆమె బతికే ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అంత్యక్రియలు ఆపేశారు. అనంతరం ఆమెను పూరీ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె బతికే ఉందని వైద్యులు తెలిపారు.
గంజాం జిల్లాలోని పోల్సారా నివాసి అయిన పి. లక్ష్మి అనే 86 ఏళ్ల మహిళ అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె మరణించినట్లు వెల్లడించారు. సోమవారం ఆమె మృతదేహాన్ని పూరిలోని స్వర్గద్వార్ శ్మశానవాటికకు అంతిమ సంస్కారాల కోసం తరలించారు. కానీ చితికి నిప్పు పెట్టడానికి కొన్ని క్షణాల ముందు, ఆమె తిరిగి ప్రాణం పోసుకుంది.