India Health Care: మనిషి బ్రతకాలంటే ఆహారం తీసుకోవాలి. అందులో ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. పోషాకాహారం లేకపోతే ప్రజలు ఆరోగ్యంగా ఉండరు. పోషకాహార లోపంతో ఇండియాలో ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోషకాహార సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే పోషకాహార లోపం సమస్య కేవలం ఇండియాలోనే కాదు.. ఇది యూనివర్సల్ సమస్యగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం ఉంది. అది 2021 కంటే 2023లో బాగా పెరిగిందని నివేదిక పేర్కొంది.
Read also: Rythu Bandhu: నేటి నుంచే ఖాతాల్లో రైతు బంధు నగదు.. పదకొండో విడుత సాయానికి సర్కారు సిద్ధం
ఇండియాలో పోషకాహార లోపం సమస్య బాగానే ఉంది. ఇందులో కూడా ప్రధానంగా సూక్ష్మ పోషకాల లోపం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని ఆహార నిపుణులు పేర్కొన్నారు. దేశంలో ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్న ఈ పైకి కనిపించని ఆకలి సమస్యను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఈ మేరకు అంతర్జాతీయ ఆహార పాలసీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఎఫ్‌పీఆర్‌ఐ) ఇటీవల ది గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్టు(జీఎఫ్‌పీఆర్)-2023 పేరుతో నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం సమస్యతో బాధ పడుతున్న వారి సంఖ్య 2021 నాటికి 76.8 కోట్లకు పెరిగింది. ఇది 2014లో 57.2 కోట్లుగా ఉండగా.. అదికాస్త 2021కి 34.2 శాతం పెరిగిందని నివేదిక పేర్కొన్నది. పోషకాహార లోపం సమస్య 2019-21 మధ్యలో ఆఫ్గానిస్థాన్‌లో 30 శాతం, పాకిస్థాన్‌లో 17శాతం ఉంది. భారత్‌లో 16 శాతం, బంగ్లాదేశ్‌లో 12 శాతం, నేపాల్‌లో 6 శాతం, శ్రీలంకలో 4 శాతంగా ఉన్నదని నివేదిక ప్రకటించింది.
Read also: Shiva stotram: వివాహం జరగాలంటే సోమవారం ఈ సోత్రం వినండి
భారత్‌లో ఆహార ఉత్పత్తికి సమస్య లేదు. కానీ సూక్ష్మ పోషకాల సమస్య ఎక్కువగా ఉంది. ఇండియాలో ఆహార ఉత్పత్తి లభ్యత మెరుగ్గానే ఉన్నప్పటికీ, అవి ప్రజలకు చేరడంలో సమస్యలు ఉన్నాయని ఐఎఫ్‌పీఆర్‌ఐ దక్షిణాసియా డైరెక్టర్ షాహిదుర్ రషీద్ పేర్కొన్నారు. ఆరోగ్యానికి బియ్యం, గోధుమలు వంటి ఆహార పదార్థాలు తింటే సరిపోదని, వాటి ద్వారా అందుతున్న పోషకాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సూక్ష్మ పోషకాల లోపంగా పిలిచే పైకి కనిపించని ఆకలి(హిడెన్ హంగర్) అనేది భారత్‌తో సహా దక్షిణాసియా ప్రాంతాల్లో అధికంగా ఉన్నదని నివేదిక పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు తరాల కోసం సరిపడా సూక్ష్మ పోషకాలను అందించే మార్గాలపై ఆలోచన చేయాలని సూచించారు. పర్యావరణ మార్పులతో పాటు పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా బియ్యం, గోధుమలు వంటి పంటల్లో పోషకాల నాణ్యత తగ్గుతుందని ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఆర్‌ఆర్‌ఐ) ప్రతినిధి రంజితా పుష్కర్ పేర్కొన్నారు. పోషకాహార భద్రత కోసం ప్రత్యేక విధానం ఉండాల్సిన అవసరం ఉన్నదని అగ్రికల్చర్ ఎకనమిక్స్ రిసెర్చ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రమోద్ జోషి అభిప్రాయపడ్డారు. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు.