NTV Telugu Site icon

Nupur Sharma: నుపుర్‌శర్మ, నవీన్ జిందాల్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

Nupur

Nupur

కొన్ని రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో భాజపా జాతీయ అధికారి ప్రతినిధి నుపుర్‌ శర్మ మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్‌ జిందాల్‌ అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్లో స్పందించడం ఇటీవల తీవ్ర దుమారానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన భాజపా.. నుపుర్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత నుపుర్‌ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా తెలిపారు.
అయితే, అప్పటికే వీరి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. తమ మత విశ్వాసాలను కించపరిస్తే సహించేది లేదని ఇస్లామిక్‌ దేశాలు మండిపడుతున్నాయి. కొన్ని దేశాల్లో భారతీయ ఉత్పత్తుల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చే స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. కువైట్‌లోని ఓ స్టోర్‌లో భారతీయ ఉత్పత్తులను ఒక చోట పోగేసి ఆ వస్తువులను బహిష్కరిస్తున్నట్లు బోర్డులు కూడా పెట్టడం గమనార్హం.

Biotech Startup Expo: నేడు బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022ను ప్రారంభించనున్న ప్రధాని

సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంతతకు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ భంగం కలిగించారని వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు బుధవారం వారిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, షాదాబ్ చౌహాన్, సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా షకున్‌లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అనేక మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, దేశంలో అశాంతిని సృష్టించే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

Show comments