Nupur Sharma-Prophet row: దేశంలో సంచలనం రేపిన నుపుర్ శర్మ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నుపుర్ శర్మకు మద్దతు తెలిపారనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఇతరులపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు హత్యలు కూడా జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దాడి జరిగింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు కొంతమంది వ్యక్తులు ఆయుష్ జాదవ్ (25) అనే భజరంగ్ దళ్ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం బాధితుడు ఆయుష్ జాదవ్ మోటర్ సైకిల్ పై వెళ్తున్న క్రమంలో అడ్డగించి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయుష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.
ఈ దాడిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు నేషనల్ సెక్యురిటీ యాక్ట్ కేసులను ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేశారు. మొత్తం ఈ ఘటనలో 13 మంది పాల్గొనగా.. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన ఐదుగురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. మధ్యప్రదేశ్ లో శాంతి భద్రలకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 307 (హత్య ప్రయత్నం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also: National Herald Case: ఈడీ పేరిట సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. దీని తరువాత కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నుపుర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు తెలపిన కారణంగా ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ను అత్యంత కిరాతకంగా ఇద్దరు మతోన్మాదులు తల నరికి హత్య చేశారు. ఈ ఘటనకు ముందే మహరాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కూడా దారుణంగా హత్య చేశారు. తాజాగా జరిగిన ఘటనపై అగర్ మాల్వా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హిందూ గ్రూపులు ఎస్పీ కార్యాలయం ముందు నిందితులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.