NTV Telugu Site icon

Asaduddin Owaisi: ముస్లింలను అంతం చేయడమే వక్ఫ్ బిల్లు లక్ష్యం..

Owaisi

Owaisi

Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో చాలా ప్రమాదకరమైన సెక్షన్లు ఉన్నాయని గురువారం విరుచుకుపడ్డారు. ఇది చట్టం కాదని, వక్ఫ్‌ని నేలమట్టం చేసి, ముస్లింలను అంతం చేయడమే లక్ష్యమని ఆరోపించారు. బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు రూల్ 72 ప్రకారం స్పీకర్‌కి నోటీసులు ఇచ్చానని, బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పారు. ఈ బిల్లు ఆర్టికల్ 14,15, 25 సూత్రాలను ఉల్లంఘిస్తోందని చెప్పారు. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని కూడా దెబ్బతీస్తుందని అన్నారు.

Read Also: Pawan Kalyan: సినీ హీరోలపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల

ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చెబుతున్న మసీదులను లాక్కోవడానికి, రైట్ వింగ్ హిందుత్వ సంస్థలు ఆరోపిస్తున్న దర్గాలను లాక్కోవాలని భావిస్తున్నట్లు ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్‌ని తీసేసి 400 ఏళ్ల నాటి పురాతన పత్రాలను తీసుకురావాలని చెబితే ఎలా.? అని ప్రశ్నించారు. ఇందులో చాలా ప్రమాదకరమైన సెక్షన్లు ఉన్నాయని, వక్ఫ్ బోర్డు మంచికి బదులు దానిని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మత స్వేచ్ఛకు తీవ్ర విఘాతమని, ఎవరైనా ముస్లిం కాదా అని నిర్ణయించడానికి మీరు ఎవరు..? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే ప్రతిపక్షాల విమర్శలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డుల్లోకి మాఫియా చొరబడిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలోని సచార్ కమిటీ సిఫారసులతోనే బిల్లును రూపొందించినట్లు పేర్కొన్నారు. బిల్లు రూపొందించే ముందు అనేక మంది ముస్లిం పెద్దలతో మాట్లాడినట్లు చెప్పారు. వక్ఫ్ ఆక్రమణ, అక్రమాలపై తిరుచిరాపల్లి ఆలయం వివాదాన్ని, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వివాదాన్ని ప్రస్తావించారు. 1500 ఏళ్ల ఆలయం ఉన్న గ్రామం మొత్తం వక్ఫ్ ఆస్తి ఎలా అవుతుందని కేంద్రమంత్రి ప్రశ్నించారు.