నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి నోటీసులు పంపించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. అందులో భాగంగా ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు రాహుల్ గాంధీ.. ముగ్గురు అధికారుల ఈడీ బృందం రాహుల్‌ను ప్రశ్నించింది.. నేషనల్ హెరాల్డ్‌తో సంబంధాలు, ఏజేఎల్‌లో ఉన్న స్థానం, యంగ్ ఇండియాలో పాత్రపై రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుండగా.. ఆయన మాత్రం తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం.. అయితే, ఇదే సమయంలో రాహుల్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.. కేంద్రం గాంధీ కుటుంబంపై కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.. అయితే, వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
Read Also: Nupur Sharma: నుపుర్ శర్మకు షాకిచ్చిన కోల్‌కతా పోలీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమాలపై విచారణ జరుపుతుంటే.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు స్మృతి ఇరానీ. ఈడీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టిందని ఆరోపించిన ఆమె.. గాంధీ ఆస్తులను రక్షించేందుకు కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిందంటూ ఎద్దేవా చేశారు.. ఇక, జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించిన కేంద్ర మంత్రి… గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. అందులో రాహుల్ గాంధీ కూడా ఒకరని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.