Sambhal Mosque: గతేడాది నవంబర్‌లో ఘర్షణకు కేరాఫ్‌గా మారిన ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాష్ ‘‘షాహీ జామా మసీదు’’ మరోసారి వార్తల్లో నిలిచింది. రంజాన్‌కి ముందు మసీదుని పునరుద్ధరించడానికి జామా మసీదు యాజమాన్యం ఏఎస్ఐ అనుమతిని కోరింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత, సంభాల్ జిల్లా యంత్రాంగం ఏఎస్ఐ అనుమతి లేకుండా మసీదులో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ కు ముందు మసీదును శుభ్రం చేయడానికి, పెయింట్ చేయడానికి మరియు అలంకరించడానికి అనుమతి కోరుతూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి లేఖ రాసినట్లు షాహి జామా మసీదు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలీ ఆదివారం విలేకరులకు తెలిపారు.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్ వైమానిక స్థావరంపై దాడి, ఒకరు మృతి..
నిర్వహణ కమిటీ ఏఎస్ఐకి రాసిన లేఖ గురించి అడిగినప్పుడు, సంభాల్ జిల్లా కలెక్టర్ రాజేందర్ పెన్సియా మాట్లాడుతూ.. ఈ విషయం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ ప్రాపర్టీ ఏఎస్ఐకి చెందుతుందని అన్నారు. ఏఎస్ఐ దీనిపై నిర్ణయం తీసుకోవాలని, అనుమతి వచ్చే వరకు మసీదులో ఎలాంటి పనులు చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఈ రకమైన వివాదాస్పద కట్టడానికి రంగులు వేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోను, అయినప్పటికీ ఏఎస్ఐ నిర్ణయం తీసుకోవాలి, మావైపు నుంచి ఏమీ లేదు అని ఆయన వెల్లడించారు.
మొఘల్ కాలం నాటి ఈ మసీదును ప్రాచీన హిందూ ఆలయమైన హరిహర్ మందరాన్ని కూల్చేసి కట్టారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సర్వే చేయాలని, గత నవంబర్‌లో కోర్టు ఆదేశించింది. అధికారులు సర్వేకి వెళ్లే సమయంలో, స్థానిక ముస్లిం గుంపు వారిపై దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు మరణించగా, 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.