Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలవడంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి గెలవడంపై మహారాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం లేదని, ఆనందం కనిపించడం లేదని శరద్ పవార్ శనివారం అన్నారు. కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు.
Read Also: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్ ప్రకటన..
లడ్కీ బహిన్ పథకం కింద మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 1500 నుంచి రూ. 2100కి పెంచడంతో పాటు ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం నిలబెట్టుకునేలా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కృషి చేస్తుందని చెప్పారు. మహాయుతి ఘన విజయంపై ప్రజల్లో ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదని అన్నారు.
శివసేన ఠాక్రే వర్గం నేత బాబ్రీ మసీదు కూల్చివేతను పొగుడుతూ కామెంట్స్ చేయడంపై మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తప్పుకుంది. దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. ఎస్పీ కేంద్ర నాయకత్వం ప్రతిపక్షాల ఐక్యతపై దృఢంగా ఉన్నారని చెప్పారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి పార్టీలకు సంఖ్యా బలం లేకపోవడంతో ప్రతిపక్ష హోదా కోరడం లేదని చెప్పారు.