Covid Vaccine: భారతదేశంలో కోవిడ్-19 నివారణకు ఉపయోగిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు, గుండె పోటులకు ఎలాంటి సంబంధం లేదని ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల గుండె పోటు వస్తుందనే వార్తల నేపథ్యంలో ఈ స్టడీ తన ఫలితాలను నివేదించింది. కోవిషీల్డ్, కోవాక్సిన్ హర్ట్ ఎటాక్స్ మధ్య సంబంధంపై నిర్వహించిన అధ్యయనాన్ని PLOS One జర్నల్‌లో ఇటీవల ప్రచురించబడింది. మయోకార్డియల్ ఇన్పార్‌క్షన్ (గుండెపోటు)పై టీకాల ప్రభావాన్ని అధ్యయనం చేసింది.
ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్ లో ఆగస్టు 2021, ఆగస్టు 2022 మధ్య చేరిన 1578 మందిపై ఈ స్టడీని నిర్వహించారు. ఇందులో 1086(68.8 శాతం) మందికి కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు. 492(31.2 శాతం) మందికి వ్యాక్సిన్లు ఇవ్వలేదు. టీకా తీసుకున్న వారిలో 1047 మంది రెండు డోసులు తీసుకోగా.. 39 మంది ఒకే డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.
Read Also: Pushkar Singh Dhami: ‘భారత రాష్ట్రపతి’ అనే పదాన్ని వాడడం దేశప్రజలకు గర్వకారణం
ఈ అధ్యయనం ద్వారా టీకాలు సురక్షితమైనవిగా తేలాయని, వ్యాక్సిన్లకు-గుండెపోట్లకు సంబంధం లేదని, నిజానికి వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో గుండె పోటుతో మరణించే అవకాశాలు తగ్గాయని తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన మోహిత్ గుప్తా తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ల రియాక్షన్స్ చాలా వరకు తేలికపాటివని, తాత్కాలికమైనవని తెలిపారు. అయితే వీటి వల్ల గుండెపోటు సంభవిస్తుందనే వాదన ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది.
తాజా అధ్యయనంలో రోగులకు ఇచ్చిన వ్యాక్సిన్, తేదీ, దాని వల్ల వచ్చే ప్రతీకూల ప్రభావాలతో సహా రోగికి సంబంధించిన పూర్తి డేటాను నమోదు చేశారు. 30 రోజుల రోగుల ఫాలో అప్ లో 201 రోగులలో అన్ని కారణాల వల్ల మరణాలు సంభవించాయి. టీకాలు తీసుకున్న వారిలో మరణాల తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇదే విధంగా ఆరు నెలల పరిశీలనలో టీకాలు వేయని వారిలో పోలిస్తే టీకాలు తీసుకున్న వారిలో మరణాల సంభావ్యత తక్కువగా ఉన్నట్లు తేలింది. వయోభారం, మధుమేహం, ధూమపానం చేసేవారిలో 30 రోజుల మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది సింగిల్ సెంటర్ రెట్రోస్పెక్టివ్ అధ్యయనం అని.. వివిధ జాతుల సమూహాల నుంచి పెద్ద సంఖ్యలో అధ్యయనం చేసి ధృవీకరించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.