No Decision Yet To Stop Flights From China, Says Centre: కరోనా మహమ్మారికి జన్మస్థలం అయిన చైనా ఎప్పుడూ లేని విధంగా మహమ్మారి బారినపడి అల్లాడుతోంది. గతంలో రోజుల వ్యవధిలో అక్కడ వేల కేసులు నమోదు అయితే.. ప్రస్తుతం గంటల్లోనే వేల కేసులు నమోదు అవుతున్నాయి. చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగింది. శ్మశాన వాటికల్లో పనిచేసేందుకు సిబ్బంది కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ‘జీరో కోవిడ్’ విధానాన్ని చైనా ఎత్తేయడంతో అక్కడ కేసుల సంఖ్య అదుపుతప్పింది. అత్యంత వేగంగా ఇన్ఫెక్షన్ కు గురిచేసే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 చైనాలో వ్యాప్తి చెందుతోంది. రాజధాని బీజింగ్ తో పాటు వాణిజ్య రాజధాని షాంఘైలో కేసులు పెరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ బీఎఫ్-7 వేరియంట్ పై భారత్ కూడా అప్రమత్తం అయింది. ప్రధాని నరేంద్రమోదీ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వరసగా అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించారు. ర్యాండమ్ గా ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు చేయనున్నారు. ఇక కేరళ, ఢిల్లీ, తెలంగాణ ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.
Read Also: Taj Mahal: తాజ్ మహల్ సందర్శించాలంటే.. కోవిడ్ పరీక్ష తప్పనిసరి
ఇదిలా ఉంటే చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమానాలను తక్షణమే నిలిపివేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం తన స్పందనను తెలియజేసింది. చైనా నుంచి వచ్చే విమానాలను నిలుపుదల చేయాలని కేంద్రప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా నుంచి భారతదేశానికి నేరుగా విమానాలు లేవు. అయితే ఇప్పటి వరకు చైనా మీదుగా భారత్ వచ్చే కనెక్టింగ్ ఫ్లైట్స్ ని నిలిపివేయాలని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబడలేదని.. పౌర విమానమంత్రిత్వశాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తుది నిర్ణయం తీసుకుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశంలో నాలుగు బీఎఫ్-7 కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్రం బుధవారం ప్రకటించింది. అయితే వీరిలో ఇద్దర ఇంటి వద్ద ఉండే కోలుకున్నారు. ఇదిలా ఉంటే చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో కరోనా పెరుగుతున్న కారణంగా భారత్ లో కోవిడ్-19 మార్గదర్శకాలను పునరుద్ధరించడం గురించి ఆలోచించాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ట్వీట్ చేశారు.
